అవినీతిని ప్రశ్నిస్తే అధికారులను రెచ్చగొడతారా?

Kakani Govardhan Reddy Fires On TDP Leaders PSr Nellore - Sakshi

కలెక్టర్‌ అంటే గౌరం ఉంది

అధికారులుపై ద్వేషం లేదు

సర్వేపల్లి ఎమ్మెల్యే     కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మనుబోలు: తాను మంత్రి సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తుంటే కలెక్టర్‌ను దూషించానంటూ విషయం తప్పుదోవ పట్టించి కొందరు అధికారులను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనికేపల్లి గ్రామానికి సంబంధించిన ఒక పథకంలోనే దొంగ తీర్మానాలు ఇచ్చి రూ.6 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దానిపై విచారణ చేయాలని కోరామన్నారు. ఈ క్రమంలో తాము వారిని నిర్బంధించడం కాదని, వారే తమను నిర్బంధించారని ఆరోపించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.6 కోట్లకు తీర్మానాలు ఇచ్చిన విషయం, రామదాసు కండ్రిగ భూములకు సంబంధించి పరిహారాన్ని కాజేసేందుకు కొందరు ప్రయత్నించిన విషయం, అలాగే ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ సోమిరెడ్డి కుమారుడు కార్యక్రమాలకు వెళుతున్న విషయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

సోమిరెడ్డి కుమారుడు ఏ హక్కుతో ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు టీడీపీ కండువాలు కప్పుతున్నాడో చెప్పాలన్నారు. అధికారిక కార్యక్రమాల్లో కు టుంబ సభ్యులకు కూడా పాల్గొనవచ్చని చెబితే ఇకపై తాము వెళ్లలేని కార్యక్రమాలకు తమ కుటుంబ సభ్యులను కూడా పంపుతామని ఎద్దేవా చేశారు. తాము లేవనెత్తిన అంశాలను కలెక్టర్‌ ఎం దుకు వ్యక్తిగతంగా తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. సోమిరెడ్డి తన అవినీతి ఎక్కడ బయటపడిపోతుందోనని తనకు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టి సామూహిక సెలవు పెట్టాలని చెప్పారన్నారు. అయినా జిల్లాలో మెజారిటీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారంటే తాను తప్పు చేయలేదని అర్థం అవుతుందన్నారు. తాను కలెక్టర్‌ను దూషించినట్లు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే అమరావతి నుంచి ఎన్‌జీఓ నాయకులను పంపి అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలన్నారు. తనకు వ్యతిరేకంగా సామూహిక సెలవులు పెట్టాలని పురమాయించారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సామూహిక సెలవు పెడితే నష్టపోయిన జీతాన్ని కొన్ని రూ.కోట్లను చెల్లించేందుకు కూడా సీఎం సిద్ధపడ్డారని ఆరోపించారు.

ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఎదుర్కోలేక  ఇలాంటి చర్యలకు పాల్పడేందుకు ముఖ్యమంత్రికి సిగ్గుందా అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా 90 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యారని, దీనిని బట్టి తాను మాట్లాడిన విషయాల్లో వాస్తవముందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోందన్నారు. ఉద్యోగులెవరిపైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ పథకాల్లో ఎక్కడ అవినీతి జరిగినా ప్రజల పక్షాన తాను అధికారులను ప్రశ్నిస్తానన్నారు. దీన్ని అధికారులు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. ఆయన వెంట ఎంపీపీ చిట్టమూరు అనితమ్మ, సర్పంచ్‌ కంచి పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మ, మండల ఉపాధ్యక్షుడు తురిమెర్ల రఘురాంరెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, రావుల అంకయ్యగౌడ్, గుమ్మడి వెంకటసుబ్బయ్య, మన్నెమాల సుధీర్‌రెడ్డి, చెందులూరు శ్రీనివాసులు, చేడిమాల రమణకుమార్‌రెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, బొమ్మిరెడ్డి శంకర్‌రెడ్డి, కేవీఆర్‌ గౌడ్, దాసరి మహేంద్రవర్మ, దాసరి భాస్కర్‌గౌడ్, వెంకటేశ్వర్లు, నవకోటి, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమేష్‌ ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top