సోమిరెడ్డి చరిత్రంతా అవినీతిమయం | Kakani Govardhan Reddy Fires On Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి చరిత్రంతా అవినీతిమయం

Jul 12 2018 12:10 PM | Updated on Aug 20 2018 6:07 PM

Kakani Govardhan Reddy Fires On Somireddy Chandramohan Reddy - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పక్కన నాయకులు

నెల్లూరు(సెంట్రల్‌): మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడి చరిత్రంతా అవినీతిమయమని, ఆయన్ను కలెక్టర్‌ ఎందుకు సమర్ధిస్తున్నారని, అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉద్యోగ సంఘాలను ప్రశ్నించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మత్స్యకారులతో కలసి బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌పై తనకు గౌరవం ఉందన్నారు. ఆయన అవినీతి చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని తాను అనలేదని సృష్టం చేశారు. సోమిరెడ్డి అవినీతిపై తాము ఆధారాలతో సహా ఇచ్చినా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. చంద్రమోహన్‌రెడ్డి నకిలీ ఎరువులు, మిల్లర్ల వద్ద ముడపులు తీసుకుని రైతులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఉద్యోగ సంఘాలను ప్రశ్నించారు. మంత్రి అవినీతికి కొందరు అధికారులు కొమ్ముకాయాల్సిన అవసరం ఏంటన్నారు.

ప్రశ్నించకూడదా?
ఓ పంచాయితీ కార్యదర్శి పేరుతో రూ.6 కోట్లకు ఫోర్జరీ తీర్మానాలు చేసినా, రామదాసుకండ్రిగ భూమలకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతర రైతుల పరిహారం కాజేయాలని చూసినా, ఆ పత్రాలపై మంత్రి సంతకం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. అవినీతి, అక్రమాలపై ప్రజల తరఫున మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి అని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయా అని ప్రశ్నించారు. ఇలాగే ఉంటే తాము పోరాటాలు చేయక తప్పదన్నారు. సిలికామైన్స్‌ పేరుతో 2,200 ఎకరాలు కాజేయాలని చూసినా అడగకూడదా అన్నారు. ఓడీఎఫ్‌ అవార్డు తెచ్చుకున్నారని, ఏ గ్రామంలో పూర్తిగా మరుగుదొడ్లు నిర్మించారో చెప్పాలన్నారు. ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై చర్యలు కూడా తీసుకోమని ప్రశ్నించకూడదా అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు ఆహ్వనించి చూస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున గ్రావెల్‌ తవ్వకాల్లో అవినీతి, అక్రమాలు చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. మంత్రి కుమారుడు తనపై విచరణ చేయించాలని ర్యాలీ చేశారని,  ఆయనకు ధైర్యం ఉంటే తండ్రిని ప్రశ్నించాలన్నారు. సోమిరెడ్డి కుమారుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీసుకోకపోవడం ఏంటన్నారు. తాను ఒక ఈఈని దిగ్బందించానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో కొందరు రాజకీయం చేస్తూ బీసీలను, మత్స్యకారులను రెచ్చగొడుతున్నారన్నారు. 

నిరూపిస్తారా?
కలెక్టర్‌ ముత్యాలరాజును తాను ఖబడ్దార్‌ అన్నట్టు, అలాగే తాను కలెక్టర్‌ కార్యాలయానికి వస్తే ఆయన పారిపోయారని వ్యాఖ్యానించినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయన్నారు. ఖబడ్దార్‌ అన్నట్టు నిరూపిస్తే తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్తానన్నారు. నిరూపించ లేకపోతే ఉద్యోగ సంఘాలు ఏం సమాధానం చెప్తాయన్నారు. ఉద్యోగ సంఘాలు 24 గంటల్లో నిరూపించగలరా అని సూటిగా ప్రశ్నించారు. సోమిరెడ్డి అరాచకాలపై తాను మాట్లాడి ఫిర్యాదులు చేస్తుంటే కొందరు విషయాన్ని తప్పుదోవ పట్టించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరీషా, జెడ్పీటీసీలు మందల వెంకటశేషయ్య, నెల్లూరు శివప్రసాద్, దాసరి భాస్కర్‌గౌడ్, రాగాల వెంకటేశ్వర్లు, ఆనంద్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement