‘ఆ నలుగురి నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి’

K Laxman Speech At Mahabubnagar Sabha - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : తెలంగాణలో పాలన ఆ నలుగురు పాలైందని.. ఆ నలుగురు నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్‌ అప్పుల తెలంగాణ తీర్చిదిద్దారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదని, మహిళా సంఘాలకు సహకారం అందలేదని, కేసీఆర్‌ కేబినేట్‌లో ఒక్క మహిళా లేదని విమర్శించారు. మోదీ మాత్రం రక్షణ శాఖకు తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్‌ను మంత్రిగా నియమించారని తెలిపారు.

తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే బోర్లకు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ మాటలు వింటే కడుపు నిండిపోతోంది.. చేతలు చూస్తే కడుపు మండుతోందని విరుచుకపడ్డారు. కేసీఆర్‌ చెప్పినట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని కుమారస్వామి చెప్పడం చూస్తే.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదని స్పష్టమవుతోందని అన్నారు. మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షపాతి నరేంద్ర మోదీయేనని, కేసీఆర్‌లా మతపరమైన రిజర్వేషన్లు కాకుండా కులాలవారిగా అవసరమైన రిజర్వేషన్లను అమలుచేస్తామని ప్రకటించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top