అందుకే మద్దతు ఉపసంహరణ: మారాండీ

Jharkhand: Babulal Marandi Withdraws Support From Hemant Soren Govt - Sakshi

రాంచి: జార్ఖండ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు నెల రోజుల క్రితం జేఎంఎం, కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారులో చేరిన జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జేవీఎం) కూటమి నుంచి బయటకు వచ్చింది. హేమంత్‌ సోరేన్‌కు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. తమ పార్టీని చీల్చేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేవీఎం అధ్యక్షుడు బాబులాల్‌ మారాండీ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు ఆయన లేఖ రాశారు.

‘మీ నేతృత్వంలోని (హేమంత్‌ సోరేన్‌) ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తూ మా పార్టీ జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా డిసెంబర్‌ 24, 2019న లేఖ ఇచ్చింది. కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని జేవీఎంను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు దినపత్రికలు ఈరోజు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించామ’ని లేఖలో బాబులాల్‌ మారాండీ పేర్కొన్నారు.

జేవీఎం ఎమ్మెల్యేలు ప్రదీప్‌ యాదవ్‌, బంధు టిక్రీ.. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్టు వార్తలు రావడంతో వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు రేగాయి. రాహుల్‌ గాంధీ, జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆర్పీఎన్‌ సింగ్‌లను కూడా వారు కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇటీవల జరిగిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం మూడు స్థానాల్లో గెలిచింది. ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఒక్కరు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు. కాగా, జేవీఎం మద్దతు ఉపసంహరించుకున్నా హేమంత్‌ సోరేన్‌ సర్కారు ఎటువంటి ముప్పులేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top