వారసుల కోసమే రాజకీయ సన్యాసం

Jamili Elections Congress Leaders Tensions In Karimnagar - Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో ముందస్తు ఎన్నికలవేడి రాజుకుంటోంది. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తా మని.. కొంతమంది నాకే టికెట్‌ వస్తుందంటూ, అధిష్టానం సమ్మతించిందంటూ గందరగోళం సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
– సాక్షిప్రతినిధి, కరీంనగర్‌  

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ‘పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటున్నాం.. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తున్నాయని తెలిసి వలస నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు.. సీనియర్ల ముందు వారి పెత్తనం ఏందీ.. పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం.. కానీ కొంతమంది నాకే టికెట్‌ వస్తుందంటూ, అధిష్టానం సమ్మతించిందంటూ లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు.. కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.. ఈ పద్ధతికి స్వస్తి పలకాలి’ అంటూ హుజూ రాబాద్, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన సీనియర్‌ నేతలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుటే వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం వాడివేడిగా సాగింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేయడంతో రచ్చరచ్చగా మారింది. కాంగ్రెస్‌ పార్టీలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే ఉద్దేశంతో అప్పుడే హడావిడి మొదలైంది.

టికెట్లు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ప్రత్యర్థులపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. బలాలు, బలహీనతలను బేరీజు వేస్తూ తమకే టికెట్‌ ఇవ్వాలంటూ ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్‌కృష్ణన్‌ ఎదుటే బలప్రదర్శనకు దిగడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. వాగ్వాదాలు, అలకలు, బుజ్జగింపులతో మంగళవారం కరీంనగర్‌ జిల్లా డీసీసీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడిజిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తల సమావేశం వాడివేడిగా సాగింది. హుజూరాబాద్‌ నేతలు బాహాబాహీకి దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు అధికార పార్టీకి కోవర్టుగా మారారంటూ సీనియర్‌ నేతలు తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి ఆరోపించారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లేకపోతే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తేల్చిచెప్పారు. ‘పాడి కౌశిక్‌రెడ్డి తనకు టికెట్‌ ఖరారైంది.. పీసీసీ అద్యక్షుడు తనకు సమీప బంధువేనని ప్రచారం చేసుకుంటున్నారని’ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. హుజూరాబాద్‌ పరిస్థితిపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ పరిశీలకుడు సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్‌గౌడ్‌ను కోఆర్డినేటర్‌గా నియమించారు. నివేదిక ఆధారంగా ఎన్నికలకు రెండు నెలల ముందే హుజూరాబాద్‌ టికెట్‌ను ప్రకటిస్తామని పరిశీలకుడు స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకు ఉన్న ఉద్రిక్తత చల్లబడింది.
 
ఆశావాహుల్లో టికెట్ల సందడి..
సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే సంకేతాలు వెలువడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో టికెట్ల సందడి నెలకొంది. మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ధర్మపురిలో జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఇబ్బందులు లేకపోవడంతో ఆయా నియోజవర్గాల సమావేశాలు సాదాసీదాగా నడిచాయి. హుస్నాబాద్‌ నుంచి మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌కుమార్, బొమ్మ వెంకటేశ్వర్లు, కోరుట్ల నుంచి కొమొరెడ్డి రాములు, డాక్టర్‌ వెంకట్‌ సమావేశానికి హాజరయ్యారు. రామగుండం గందరగోళంగా ఉందని అక్కడి నేతలు తెలిపారు. అయితే.. టికెట్లు ఆశించేవారు ఓపికగా ఉండాలని పరిశీలకుడు స్పష్టం చేశారు.

శ్రీధర్‌బాబు ఇంట్లో సమావేశం..
ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్‌కృష్ణన్‌ను కలవడానికి ముందే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఇంట్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్‌ కార్యాచరణపై మాట్లాడినట్లు తెలిసింది. అయితే పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో అక్కడి పరిస్థితిపై చర్చించారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
 
పరిశీలకుని వద్దకు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు..
జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలుగా 13 నియోజకవర్గాల నుంచి ఆశావహులు హాజరయ్యారు. జగిత్యాల, మంథని నియోజకవర్గాల నుంచి సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హుజూరాబాద్‌ నుంచి తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడికౌశిక్‌రెడ్డి, పారిపాటి రవీందర్‌రెడ్డి, స్వర్గం రవిలు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డి, కొణగాల మహేశ్‌ హాజరయ్యారు.

చొప్పదండి సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, బండ శంకర్, నాగి శేఖర్, పెద్దపల్లి నుంచి గీట్ల సబితారెడ్డి, ఈర్ల కొమురయ్య, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి, చేతి ధర్మయ్య, సీహెచ్‌ విజయరమణారావు ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాసన్‌ కృష్ణన్‌తో భేటీ అయ్యారు. అలాగే హుస్నాబాద్‌ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ వెంకన్న, కరీంనగర్‌ నుంచి చల్మెడ లక్ష్మినర్సింహారావు, రేగులపాటి రమ్యరావు తదితరులు, కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములు, జీఎన్‌ వెంకట్, మానకొండూర్‌ నుంచి ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మద్దెల రవీందర్‌ పాల్గొన్నారు. రామగుండం నుంచి రాజ్‌ఠాగూర్‌ మక్కాన్‌సింగ్, జనక్‌ప్రసాద్‌ టిక్కెట్లు ఆశిస్తుండగా, సిరిసిల్ల నుంచి కె.కె మహేందర్‌రెడ్డి, చీటి ఉమేష్‌రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జీలు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వేములవాడ, పెద్దపల్లిలోనూ అదే పరిస్థితి..

కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు వస్తున్నాయంటూ వేములవాడ, పెద్దపల్లి, చొప్పదండి నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోందని, ఎన్నికలు రాకముందే టికెట్లు ఎలా కేటాయించారో స్పష్టం చేయాలని ఆది శ్రీనివాస్, విజయరమణారావు, కవ్వంపెల్లి సత్యంను ఉద్దేశించి సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వలస నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారని మండిపడ్డారు. కమిటీలు, ఇన్‌చార్జీలను నియమించే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఏనుగు మనోహర్‌రెడ్డి, చేతి ధర్మయ్య, గీట్ల సబితారెడ్డి, సురేష్‌రెడ్డి, ఈర్ల కొమురయ్య, సుద్దాల దేవయ్య వలస నేతల పెత్తనంపై ధ్వజమెత్తారు. అయితే.. పనితీరును పరిశీలించాకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని పరిశీలకుడు తెలపడంతో సద్దుమణిగింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top