‘మంత్రి’దండం!

Internal Category In TRS Leaders In Khammam - Sakshi

టీఆర్‌ఎస్‌లో తలనొప్పిలా మారిన అంతర్గత వర్గపోరు  

మంత్రి తుమ్మల పైనే ద్వితీయ శ్రేణి నేతల ఆశలు 

ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటనలు ఫలించేనా.. 

సాక్షిప్రతినిధి, ఖమ్మం : టీఆర్‌ఎస్‌లో అంతర్గత వర్గపోరు ఆ పార్టీ నేతలకు తలనొప్పిలా మారింది. పాత, కొత్త నేతలు పార్టీలో కొనసాగుతుండడం.. వారి మధ్య సఖ్యత లేకపోవడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించేందుకు అనుసరించే వ్యూహంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక శాసనసభ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ నియోజకవర్గాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతున్నా.. పది నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరు పార్టీకి పంటికింద రాయిలా మారిందన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి.

2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది శాసనసభ స్థానాలకు, ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేసిన టీఆర్‌ఎస్‌.. కేవలం కొత్తగూడెం ఎమ్మెల్యే, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పటి వరకు జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. ఆ తర్వాత జిల్లాలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీనియర్‌ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం, ఆయనతోపాటు ఎమ్మెల్సీగా ఉన్న బాలసాని, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొండబాలతోపాటు అనేక మంది ద్వితీయ, మండలస్థాయి నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కమార్, కోరం కనకయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఆయా పార్టీలను వీడి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో కొద్ది కాలానికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడం.. అదే ఏడాది మే నెలలో జరిగిన పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

 ‘తుమ్మల’ వ్యూహంపైనే ఆసక్తి..

 జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసే నేతగా తుమ్మల ఎదగడంతోపాటు.. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేరొందారు. తానొవ్వక.. నొప్పించని రీతిలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న తుమ్మల.. జిల్లాలో పార్టీని గెలిపించేందుకు ఎటువంటి మంత్రదండం ప్రదర్శిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు, అధికారం చేపట్టిన తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల మధ్య నెలకొన్న అంతరం రోజురోజుకు పెరుగుతుందే తప్ప.. తగ్గని పరిస్థితి నెలకొంది. అలాగే పలు పార్టీల నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిధులు, ఉద్యమ కాలంలో పనిచేసిన కార్యకర్తలకు మధ్య పొసగని పరిస్థితి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్‌ఎస్‌కు సవాల్‌గానే మారింది. రాజకీయాలపై పూర్తి పట్టున్న మంత్రి తుమ్మల.. పార్టీలో అంతర్గత పోరును చల్లార్చేందుకు రాజకీయ చతురతను ఎలా ప్రదర్శిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని వివిధ సందర్భాల్లో చుట్టొచ్చిన తుమ్మల.. పార్టీ కార్యకర్తలకు భవిష్యత్‌పై భరోసా ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న అంతరాలపై దృష్టి సారించాలని, సాధ్యమైనంత వరకు మండల, నియోజకవర్గస్థాయి నేతలు వాటిని పరిష్కరించి ఎన్నికలకు సమాయత్తం చేయాలని ప్రజాప్రతినిధులకు, జిల్లాస్థాయి నేతలకు మంత్రి చేస్తున్న ఉద్భోద ఇందులో భాగమేనన్న భావన రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.

లోతు అధ్యయనానికే పర్యటన..

రైతుబంధు పథకం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు రోజూ జిల్లాలోని మూడు నుంచి ఐదు మండలాల వరకు మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా మండలాల్లో పార్టీ పరిస్థితిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని ప్రచారం జరుగుతోంది. గ్రామ, మండల స్థాయిలో వర్గ పోరుకు అనేకచోట్ల వ్యక్తిగత ప్రతిష్టలే కారణమన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పటిష్టానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించి కాయకల్ప చికిత్స చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం, మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుతోపాటు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలైన వైరా, అశ్వారావుపేట, పినపాక, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగుర వేయాల్సిన బాధ్యత మంత్రిగా తుమ్మలపై పడింది. ఇవేకాక ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, సీపీఎం ఎమ్మెల్యే ఉన్న భద్రాచలం ని యోజకవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్‌ విజయం సాధించాల్సిన ఆవశ్యకతపై ఆయా నియోజకవర్గాల నేతలతో మంత్రి తుమ్మలతోపాటు ఆయా నియోజకవర్గాల ఎంపీలు తరచూ సమావేశం అవుతూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

అయితే జిల్లా, మం డలస్థాయిలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అనేక కారణాలతో ఏళ్లతరబడి వాయిదా పడుతుండటం, ఖ మ్మం జిల్లాలో అనేక మార్కెట్‌ కమిటీలకు పాలక వర్గాలు లేని పరిస్థితి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఉమ్మడి జిల్లాకు నాలుగు లభించినా.. పదుల సంఖ్యలో ఉండే డైరెక్టర్‌ పదవులు మాత్రం ఏ ఒక్క ద్వితీయశ్రేణి నేతను వరించకపోవడంతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. సరైన గుర్తింపు లభించడం లేదన్న కారణంతో పలువురు సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితిలో చేరారు.

మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి చెందిన వారు సైతం టీజేఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న నేతలకు భరోసా కల్పించేందుకు పార్టీ నేతలు తీసుకునే చొరవ సైతం పార్టీ విజయావకాశాలను పెంచుతుందన్న భావన ఉద్యమకారుల్లో నెలకొంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top