ఇదీ మోదీ తరహా ‘ధర్మం’

India Unemployment Rate Hit 45-Year High: Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్యపై ‘నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌’ నిర్వహించిన అధ్యయన వివరాలను వెల్లడించవద్దంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హుకుం జారీ చేయడాన్ని నిరసిస్తూ ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’ నుంచి గత వారంలో ఇద్దరు స్వతంత్య్ర సభ్యులు రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యులు మాత్రమే కమిషన్‌లో కొనసాగుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వారించినా సర్వే నివేదికలోని అంశాలను ‘బిజినస్‌ స్టాండర్ట్‌’ పత్రిక వెతికి పట్టుకొని బయట పెట్టడంతో అన్ని పత్రికలు ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి.

దేశంలో 2011–12 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 2.2 శాతం ఉండగా, 2017–2018 సంవత్సరంలో అది 6.1 శాతానికి చేరుకుందని, ఇది గడిచిన 45 ఏళ్లలో ఇదే గరిష్టమని వెల్లడించడమే మోదీ ప్రభుత్వం ఆ నివేదిక విడుదలను అడ్డుకోవడానికి కారణం. ఇలాంటి నివేదికలను ఇలా అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం పనితీరు బాగా లేదని సూచించే అధికార గణాంకాలను, నివేదికలను మోదీ ప్రభుత్వం మొదటి నుంచి అడ్డుకుంటోంది. 2017లో ‘ఉద్యోగ నియామకాలు–నిరుద్యోగం’ అంశంపై నిర్వహించాల్సిన జాతీయ సర్వేను రద్దు చేసింది. దేశంలోని ఉద్యోగ అవకాశాలపై ‘లేబర్‌ బ్యూరో’ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన సర్వేలను వద్దన్నది. ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తానంటూ 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమవడం వల్లనే మోదీ ప్రభుత్వం ఇలాంటి నివేదికలను బయటకు రానీయడం లేదన్నది సుస్పష్టం.

జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై ఇదే ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’ ఇచ్చిన నివేదికను కూడా మోదీ ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం హయాంలో ఉన్న జీడీపీ వృద్ధి రేటు నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో పడిపోయినట్లు ఆ గణాంకాలు సూచించడమే ఆ నివేదికను తిరస్కరించడానికి కారణం. నివేదిక విడుదలకు కేంద్రం అనుమతించకపోయినా ఇప్పటి ‘నిరుద్యోగంపై నివేదిక’లోని అంశాల్లాగే అవి బయటకు వచ్చాయి. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం హయాంలో వరుసగా జీడీపీ వృద్ధి రేటు పడిపోతున్నట్లు గణాంకాలు తెలియజేస్తుండడంతో అసలు లెక్కలోనే తప్పుందని, కొత్త ప్రాతిపదికన లెక్కలు చెప్పాలని మోదీ ప్రభుత్వం 2017లో ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రాతిపదికన జీడీపీ వృద్ధిని అంచనా వేసినప్పుడు అదే పద్ధతిన అంతకు ఐదేళ్ల ముందున్న వృద్ధి రేటు కూడా అంచనా వేయడం తప్పనిసరని ఆర్థిక నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో మోదీ హయాంలో వృద్ధి రేటును కొత్త పద్ధతిన లెక్కించిన ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’ వృద్ధి రేటును 5.7 శాతంగా పేర్కొంది. అదే పద్ధతిన 2011–2012 సంవత్సరంలోని వృద్ధి రేటును అంచనా వేయగా 7.1 శాతంగా తేలింది. ఈ కారణంగా నివేదిక విడుదలను మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ అంకెలతో విభేదించిన ‘నీతి ఆయోగ్‌ (ప్రధాని సలహా మండలి)’ పాత లెక్కల జోలికి వెళ్లకుండా మోదీ ప్రభుత్వం 7.2 శాతం వృద్ధి రేటును సాధించిందని అసాధారణ నివేదికను ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్నే ప్రచారం చేసుకుంటోంది.

ప్రతి ఏటా విడుదల చేసే ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ నివేదికను కూడా ఈ సారి మోదీ ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. 1986లో ఏర్పాటయిన ఈ బ్యూరో దేశంలో జరుగుతున్న వివిధ నేరాల డేటాను సమీక్షించి ఏట వార్షిక నివేదికను విడుదల చేస్తోంది. 2016లో జరిగిన నేరాలకు సంబంధించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2017, నవంబర్‌ 30వ తేదీన క్రైమ్‌ నివేదికను విడుదల చేశారు. 2017లో జరిగిన నేరాలకు సంబంధించిన నివేదికను 2018 నవంబర్‌లో విడుదల చేయాల్సిన కేంద్ర హోం శాఖ ఇంతవరకు విడుదల చేయలేదు. దీని వెనకనున్న పరమార్థం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే ప్రభుత్వ సంస్థల ప్రతిపత్తిని, వాటి విధులను గౌరవించడం పాలకపక్షం ధర్మం!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top