
భీమవరం : తెలుగుదేశం పార్టీలో అంచెలంచలుగా ఎదిగిన అనుమోలు రేవంత్‌రెడ్డి తానున్న పార్టీపైనా, మంత్రులు, నాయకులపైనా బురదచల్లే విధంగా విమర్శలు చేయడం అవివేకమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం షరా మామూలేనని అయితే అనేక పదవులు అనుభవించి పార్టీని వీడే సమయంలో ఆ పార్టీపై, నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
రేవంత్‌రెడ్డికి టీడీపీలో కొనసాగడంలో ఇబ్బందులు ఉంటే నేరుగా పార్టీ మారుతున్నట్టు చెప్పాలి తప్ప మరొకరిపై బురదజల్లడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో ఏపీ మంత్రులకు సంబం«ధాలున్నాయని చెప్పడం భావ్యం కాదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడుల వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసుకుంటారని చినరాజప్ప స్పష్టం చేశారు.