కూటమి ఓట్ల బదిలీ జరిగిందా? 

High Tension In All Political Parties For Telangana Assembly Elections Results - Sakshi

అధికార, విపక్షాల్లో అంతర్మథనం.. భయపెడుతున్న ముక్కోణపు పోటీలు

నేతలకు చిక్కని ఓటరు నాడి.. వెంటాడుతున్న చీలిక భయం 

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇంతకాలం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగిన నేతలకు ఇపుడు కొత్త భయం వచ్చిపడింది. అధికార పార్టీని ఓడించడానికి ఈసారి కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమి.. కూటమికి చెక్‌ పెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్, మజ్లిస్‌ మధ్య అవగాహనతో ఎన్నికలకు వెళ్లాయి. అయితే.. ఈ అవగాహన క్షేత్రస్థాయిలో ఇరు పక్షాల్లో ఓట్లను బదిలీ చేసేందుకు ప్రభావితం చేసిందా అనేదే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను కలవరపెడుతోంది. ఓటరునాడి అర్థం అసలేమాత్రం అందకపోవడంతో.. ఫలితాలు వెల్లడయ్యే దాకా ఈ ఉత్కంఠ తప్పేట్లు లేదు.  

కూటమిలో టీజేఎస్‌కే అధిక భయం 
కాంగ్రెస్‌తో జతకలిసిన కోదండరాం పార్టీ టీజేఎస్‌కు కూటమి పార్టీల ఓట్ల బదిలీయే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పార్టీ పోటీ చేసిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ ఓట్లు బదిలీ అవుతాయా అన్న విషయంపై.. టీజేఎస్‌కూ అనుమానాలున్నాయి. మరోవైపు 14 స్థానాలకు పోటీ చేస్తానన్న టీడీపీ పటాన్‌చెరును కాంగ్రెస్‌కే వదిలేసింది. ఇబ్రహీంపట్నం టికెట్‌ను టీడీపీ తీసుకున్నా.. ఇక్కడ కాంగ్రెస్‌ రెబెల్‌ మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు రంగారెడ్డికి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్న సామ రంగారెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా ఓట్లు చీలిపోతాయన్న భయంతో కూటమి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖమ్మం, రంగారెడ్డికి మాత్రమే పరిమితం చేశారు. 

అధికార పక్షానికీ హడలే! 
పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికార టీఆర్‌ఎస్‌ కూడా ఓటు బదిలీపై ఆందోళనగానే ఉంది. టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని  అసదుద్దీన్‌ ముస్లింలకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో ఓటు బదిలీపై టీఆర్‌ఎస్‌ గంపెడాశలు పెట్టుకుంది. అయితే.. ఈ ఓట్లు నిజంగానే తమకు బదిలీ అయ్యాయా అన్న కంగారు అధికార పార్టీలో కనబడుతోంది. రాజేంద్రనగర్‌లో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నాయి. పాతబస్తీలో నామినేషన్లు వేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామమాత్రంగా ప్రచారం చేసినా.. వీరి ఓట్లు కూడా మజ్లిస్‌ను కలవరపెడుతున్నాయి. 

చీలికపైనే బీజేపీ ఆశలు! 
ఈసారి నగరంలో ఉన్న 5 స్థానాలకు తోడుగా జిల్లాల నుంచి మరో 7 స్థానాలపై బీజేపీ కన్నేసింది. తాము లేకుండా రాబోయే ప్రభుత్వం ఏర్పడదంటూ చెప్పుకుంటున్న పార్టీ.. ఓట్ల చీలికపై గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్‌ (అర్బన్‌), కల్వకుర్తి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, చొప్పదండి, రాజేంద్రనగర్‌లలో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రజాకూటమి, అధికార పక్షాల ఓట్లు చీలిపోగా.. ఈ స్థానాల్లో తమకున్న ప్రాబల్యంతో ఈసారి డబుల్‌ డిజిట్‌ చేరుకుంటామని కమలం పార్టీ లెక్కలు వేస్తోంది. ఈసారి 12 స్థానాల్లో గెలుస్తామని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీరాని పక్షంలో తామే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామని ధీమాగా చెబుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top