
జైపూర్ : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చే రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ ఆహూజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్‌గఢ్ నియోజకవర్గంలో పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. అయినా వెనక్కి తగ్గేదిలేదని, రామ జన్మభూమి, గో రక్షణ, హిందూత్వ వంటి ప్రచార అస్త్రాలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు. గతంలో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ జవహర్‌లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో అక్కడి విద్యార్థులు ప్రతి రోజూ మూడు వేలకు పైగా కండోమ్‌లు వాడుతారని, అమ్మాయిలు, అబ్బాయిలు విచ్చలవిడిగా తిరుగుతారంటూ వ్యాఖ్యలు చేసి వివాదంతో చిక్కుకున్నాడు.
ఇతరులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా తలతిక్క మాటలతో విరుచుకుపడడం ఆయన నైజాం. ఇలా ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడతారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో దేవ్ తీరుతో విసిగిన పార్టీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టాలని భావించింది. దీనిలో భాగంగానే ఈసారి ఎన్నికల్లో టికెట్ నిరాకరించి.. ఆ స్థానంలో బీజేపీ నేత సక్వుత్ సింగ్‌ను బరిలో నిలిపింది.