‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’ | Sakshi
Sakshi News home page

‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’

Published Thu, Mar 5 2020 9:06 PM

GVL Narsimha Rao Clearly Says Capital Is State Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు.

పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్‌ సూచించారని తెలిపారు. ఒక చానల్‌ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు  మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు.

Advertisement
Advertisement