ఆ తీర్పు రాహుల్‌కు చెంపపెట్టు: జీవీఎల్‌ | Gvl narasimharao on rahulgandhi | Sakshi
Sakshi News home page

ఆ తీర్పు రాహుల్‌కు చెంపపెట్టు: జీవీఎల్‌

Apr 20 2018 12:56 AM | Updated on Apr 20 2018 12:56 AM

Gvl narasimharao on rahulgandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ మాజీ జడ్జి బీహెచ్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌. నర్సింహారావు విమర్శించారు. లోయాది సహజ మరణమేనని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాహుల్‌ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి నర్సింహారావు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జడ్జి లోయా మృతి కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, రాహుల్‌ గాంధీ స్వయంగా రాష్ట్రపతిని కలిశారని నర్సింహారావు గుర్తుచేశారు. దీనిపై దాఖలైన పిల్‌ను కొట్టివేస్తూ ఇది రాజకీయ పన్నాగం అని కోర్టు వ్యాఖ్యానించిందన్నారు.

రాజకీయ, వ్యక్తిగత వైరాలు బయట చూసుకోవాలని, కోర్టులో కాదంటూ స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ వ్యతిరేకులకు చెంపపెట్టు వంటిదన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించేలా, అప్రతిష్టకు గురిచేసే విధంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని, ఇకనైనా ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. దత్తాత్రేయ మాట్లాడుతూ జడ్జి లోయాది సహజ మరణమేనని కుటుంబ సభ్యులు చెప్పినా శవ రాజకీయాలు చేయడానికి రాహుల్‌ గాంధీ ప్రయత్నించారని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement