‘అవినీతిలో పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు’

GVL Narasimha Rao Slams TDP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాలు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాయని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజా ధనంతో చంద్రబాబు ప్రభుత్వం దొంగ పోరాటాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తమ సమస్యల పరష్కారానికి ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, దీన్ని తరిమికొట్టేలా ఉపాధ్యాయలు కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు. విదేశీ పర్యటనల పేరుతో విలాసాలకు చేసినంత ఖర్చు కూడా ఈ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి కేటాయించడం లేదని ఆరోపించారు.

ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్‌లు న్యాయమైనవని అన్నారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఏపీలో అలా జరగడం లేదని చెప్పారు. నిధులను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక గృహాలకే పరిమితం అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణమన్నారు. అందుకే లెక్కలు చెప్పేందుకు భయపడుతున్నారని చెప్పారు. అమరావతి అభివృద్ధి పేరుతో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రూపంలో డబ్బును పార్టీ ఫండ్‌లోకి మారుస్తున్నారనే అనుమానం తమకుందని తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు.. మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. మీరు చేసే ప్రతిపనిపైనా జాతీయ స్థాయిలో మా నిఘా కూడా ఉంటుంద’ని హెచ్చరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top