
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ధోలేరా నగరాభివృద్ధికి కేంద్రం ఇచ్చింది రూ.3 వేల కోట్లేనని, చంద్రబాబు చెబుతున్నట్టు రూ.98 వేల కోట్లు కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అదీ యూపీఏ హయాంలో నిర్ణయం మేరకే జరిగిందని, ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోదీ నిధులన్నీ గుజరాత్‌కు తరలిస్తున్నారంటూ మహానాడు పేరుతో చేస్తున్న దగానాడులో చంద్రబాబు తప్పుడు కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ–ముంబై కారిడార్‌లో భాగంగా గుజరాత్‌లో ధోలేరా ఒక్క నగరాన్నే ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయగా చెన్నై–బెంగళూరు, విశాఖ–చెన్నై కారిడార్లలో కృష్ణపట్నం, విశాఖపట్నం, శ్రీకాళహస్తిని ఇండస్ట్రియల్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎంపిక చేసిందన్నారు. చంద్రబాబు ఇవి చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక నర్మద నదీ తీరాన చేపడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి కేంద్ర సాంస్కృతిక శాఖ కేవలం రూ.300 కోట్లే ఇవ్వగా అమరావతి నిర్మాణానికి కూడా ఇవ్వనన్ని నిధులు ఇచ్చారంటూ బాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ రెండు అంశాల్లో తప్పుడు కూతలు కూసిన చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.