ఎన్నికలు ముగిసినా చంద్రబాబు హడావుడి తగ్గలేదు..

GVL condemns chandrababu comments on EC working in favour of BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు అతీతంగా పని చేస్తుందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హడావుడి తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై అభ్యంతరకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జీవీఎల్‌ విమర్శించారు. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేసి ఓటమిని తప్పించుకోలేరన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో తనపై జరిగింది దాడిగా భావించడం లేదన్నారు. (గురువారం జీవీఎల్‌ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా శక్తి భార్గవ వ్యక్తి అనూహ్యంగా ఆయనపైకి బూటు విసిరాడు. వేగంగా దూసుకొచ్చిన బూటు జీవీఎల్‌ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు)

దాడులకు భయపడను...
ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని, ఇది కాంగ్రెస్‌ ప్రేరేపిత దాడిగా ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మరోసారి జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసులో సదురు వ్యక్తి చేసిన హడావుడి తనను ఉద్ధేశించి చేసింది కాదన్నారు. ఆ వ్యక్తిపై గతేడాది ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిందని, అతని దగ్గర రూ. 500 కోట్ల విలువైన బంగ్లాలు ఉన్నట్టు గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం అతను ఐటీ విచారణ ఎదుర్కొంటున్నాడని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ తన పని తాను చేసుకుపోతుంటే పార్టీ ఆఫీసులో హడావుడి చేయడం వెనుక ఉద్ధేశం ఏమిటన్నది పోలీసులు నిర్ధారిస్తారని జీవీఎల్‌ తెలిపారు.

దాడిని ఖండించిన కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి: జీవీఎల్‌ నరసింహారావుపై జరిగిన దాడిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ ఘటన కాంగ్రెస్‌ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు బీజేపీ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. తిరిగి మోదీ ప్రధాని అవటాన్ని చూసి ఓర్వలేక, సైద్దాంతిక రాజకీయాలను ఎదుర్కొనలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మే 23న వచ్చే ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టు కాగలవన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top