జగన్‌పై హత్యాయత్నం చేసింది టీడీపీ వ్యక్తే 

GV Harsha Kumar Comments about Murder Attempt On YS Jagan - Sakshi

మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ స్పష్టీకరణ 

నా వద్ద ఆధారాలు ఉన్నాయి  

హత్యాయత్నంపై సరైన దిశలో విచారణ సాగడం లేదు 

లోతైన విచారణ జరిపిస్తే ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి  

కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు కుటుంబం ముమ్మాటికీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందినదేనని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, సమాచారం తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే...  

‘‘టీడీపీ మద్దతుతో జనుపల్లి శ్రీనివాసరావు కుటుంబం తమ ప్రాంతంలో రోడ్లు కూడా వేయించుకుంది. మొదటినుంచీ తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికారంటే నమ్మలేం. జగన్‌పై హత్యాయత్నం జరిగిన దగ్గర నుంచీ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నమే కనిపించింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ అభిమాని అని నమ్మించేందుకే ప్రయత్నించారు. ఈ కేసులో సరైన దిశలో విచారణ జరపడం లేదు. నిందితుడు శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌తో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని చెబుతున్న నాటి నుంచి ఈ కుట్రకు బీజం పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. ముమ్మిడివరంలో టీడీపీ ఎమ్మెల్యే కంటే ఆయన సోదరుడు పృథ్వీరాజ్‌ చాలా బలవంతుడు.

అతడికి విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ ఓనర్‌తో పరిచయాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేయాలి. విమానాశ్రయంలో ఉద్యోగం రావాలంటే అలాంటి కీలకమైన వ్యక్తుల సిఫార్సు ఉంటేనే సాధ్యం. ఉద్యోగానికి అంత సులభంగా ఎన్‌ఓసీ సంపాదించాడంటే ఎవరో వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. జనుపల్లి శ్రీనివాసరావు తరఫున రికమెండ్‌ చేసి ఉండకపోతే అంత సులభంగా పోలీస్‌ సర్టిఫికెట్‌ రావడం సాధ్యం కాదు. ఈ దిశగా అసలు దర్యాప్తు జరిగిన దాఖలాలే కనిపించడం లేదు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీరాజ్‌కు, రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ చౌదరికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే కోణంలోనూ దర్యాప్తు జరగాలి. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై సిట్‌ విచారణ నిందితుడి కాల్‌డేటా చుట్టూ మాత్రమే జరిగింది. కుట్ర కోణాలు, టీడీపీ నేతలతో సంబంధాలు వంటి కీలక కోణాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top