కోమటిరెడ్డి రెచ్చగొడుతున్నారు: గుత్తా

Gutha Sukender Reddy takes on komatireddy venkat reddy

సాక్షి, నల్లగొండ: పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. నల్లగొండలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో  మాట్లాడుతూ... రాజకీయ ఉనికి కోసమే ఛలో అసెంబ్లీ పేరుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పత్తికి కొంత నష్టo వాటిల్లిన మాట వాస్తవమన్నారు. అందుకే పత్తి రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు చులకన అవుతున్నాయని అన్నారు. ఛలో అసెంబ్లీ ఎందుకో కోమటిరెడ్డికే తెలియాలని వ్యాఖ్యానించారు. జిల్లాలో 59 ఐకేపీ సెంటర్లు, 18 పత్తి కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి  రేవంత్‌ రెడ్డి వస్తే తన ఉనికి తగ్గిపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భయపడుతున్నారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.  రేవంత్ను బీట్ చేయడానికి, రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి చలో అసెంబ్లీ అని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వ్యవసాయం అంటే తెలియని కోమటిరెడ్డి రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారన్నారు. ఆయన కోతి చేష్టలను రైతులు నమ్మొద్దని కోరారు.

కాగా పత్తి రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 27న తలపెట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు’  తప్పా అనే స్ఫూర్తితో రైతుల తరఫున తానే ముందుండి పోరాడుతానని కోమిటిరెడ్డి నిన్న తెలిపారు. భవిష్యత్‌లో ఎంపీ, ఎమ్మెల్యే ఏదీ కాకున్నా రైతుల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top