గట్టిపోటీ కానేకాదు: అమిత్‌ షా

Gujarat, Himachal Pradesh voted for politics of performance over dynasty - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. గుజరాత్‌లో బీజేపీకి కాంగ్రెస్‌ గట్టిపోటీని ఇచ్చిందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ కన్నా కాంగ్రెస్‌ 8% వెనుకబడి ఉందనీ, అది గట్టి పోటీ కానేకాదన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఎన్నికల ఫలితాలన్నారు. ప్రధాని మోదీకి ఉన్న జనాకర్షణ, కేంద్రంలో, రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని చెప్పారు. కాంగ్రెస్‌ విభజనవాద రాజకీయాల వల్లే తమ పార్టీకి సీట్లు తగ్గాయన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

హిందువని చెప్పినా ఫలితం లేదా?
సోమ్‌నాథ్‌ మందిర్‌కు వెళ్లినప్పుడు రాహుల్‌... తాము హిందూవేతరులమని తెలిపే విజిటర్ల పుస్తకంలో సంతకం పెట్టడాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలో బీజేపీ వాదనను తిప్పికొట్టడానికి కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా కాషాయపక్షం వలలో పడి అనవసర చర్చకు ఆస్కారం కల్పించారు. రాహుల్‌ హిందువు మాత్రమే కాదు, ఆయన ‘జనేవూధారీ’ (జంధ్యం ధరించిన) బ్రాహ్మణుడని అందరూ భావించేలా సూర్జేవాలా వివరణ ఇవ్వడమేగాక గతంలో రాహుల్‌ తన కోటుపై జంధ్యం వేసుకున్నప్పటి ఫోటో ట్విటర్‌లో పెట్టి కాంగ్రెస్‌ కూడా కులాన్ని ఎన్నికల్లో ఇంత బాహాటంగా వాడుకుంటోందనే విమర్శలకు అవకాశం కల్పించారు.  

ట్యాంపరింగ్‌తోనే గెలుపు: హార్దిక్‌
గుజరాత్‌లో బీజేపీ ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌)లను ట్యాంపర్‌ చేసి, ధనబలాన్ని ఉపయోగించి గెలిచిందని పాస్‌ (పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి) నేత హార్దిక్‌ పటేల్‌ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉండుంటే కాంగ్రెసే గెలిచేదని ఆయన అన్నారు.  ‘గుజరాత్‌లో పోలింగ్‌ సమయంలో వైఫై నెట్‌వర్క్‌లను గుర్తించిన సందర్భాలున్నాయి. అలాగే ఈ రోజు ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ముందే కూడా కొన్ని ఈవీఎంలకు సీళ్లు లేవు’ అని హార్దిక్‌ ఆరోపించారు. పటీదార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న వరచ్చ రోడ్, కమ్రేజ్‌ తదితర నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

బీజేపీది నైతిక ఓటమి
‘గుజరాత్‌లో బీజేపీది నైతిక ఓటమి. 2019లో ఆ పార్టీ ఓటమికి ఇదే ఆరంభం. సమతూకంతో తీర్పు ఇచ్చిన గుజరాత్‌ ప్రజలకు అభినందనలు. ఇది బీజేపీకి తాత్కాలిక, పరువు నిలుపుకునే గెలుపు మాత్రమే. సామాన్యులపై దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు’    – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం

సంబరాలెందుకు: సీపీఎం
‘గుజరాత్‌లో బీజేపీ గెలుపు ఆ పార్టీ సంబరాలు చేసుకోవాల్సినంతగా ఏమీ లేదు. 150 సీట్లు గెలవడం తమ లక్ష్యమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రచారంలో ప్రకటించినా కనీసం వంద సీట్లు కూడా గెలవలేకపోయారు.’

తగ్గుతున్న బీజేపీ ఓట్‌బ్యాంక్‌
గుజరాత్‌లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధికంగా 60శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 49.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకును 33 శాతం నుంచి 41.4 శాతానికి పెంచుకుంది. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల ఓటు బ్యాంక్‌ తేడా 10.4% కాగా 2012 ఎన్నికల్లో 9 శాతానికి.. తాజాగా ఈ తేడా 7.7 శాతానికి తగ్గిపోయింది.

ఐదుగురు మంత్రులు చిత్తు!
అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి షాక్‌ తగిలింది. ఈ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. గధడ్‌లో దళిత మంత్రి ఆత్మారామ్‌ పర్మర్‌ కాంగ్రెస్‌ నేత ప్రవీణ్‌భాయ్‌ మరు చేతిలో, జమ్‌జోధ్‌పూర్‌లో మంత్రి చిమన్‌భాయ్‌ సపరియా చిరాగ్‌భాయ్‌ కలారియా(కాంగ్రెస్‌) చేతిలో ఓటమి చవిచూశారు. వీరితో పాటు శంకర్‌ చౌధరీ, కేశాజీ చౌహాన్, శబ్ద్‌శరణ్‌ తడ్వీలు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు.

మెజారిటీ కన్నా ‘నోటా’కే ఎక్కువ
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో బీజేపీ అభ్యర్థి బాబూభాయ్‌ బోఖారియా 1,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. అదే నియోజకవర్గంలో నోటా గుర్తుకు 3,433 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5.5 లక్షల మంది ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించి ‘నోటా’ (పైవారెవరూ కాదు)కు ఓటేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో ఇది 1.8 శాతానికి సమానం. హిమాచల్‌ప్రదేశ్‌లో 33 వేల మంది (0.9 శాతం) ఓటర్లు నోటా మీట నొక్కారు. గుజరాత్‌లో పార్టీల పరంగా నోటాకు పడిన ఓట్ల సంఖ్య బీజేపీ, కాంగ్రెస్‌ల తరువాత మూడో స్థానంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి మేవాని గెలుపొందిన వాద్గాంలో అత్యధికంగా 4,200కు పైగా, సీఎం విజయ్‌ రూపానీ పో టీచేసిన రాజ్‌కోట్‌ (పశ్చిమ)లో 3,300 నోటా ఓట్లు పోలయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top