వైఎస్సార్‌ సీపీలో చేరిన గోకరాజు రంగరాజు

Gokaraju Rangaraju Joins YSR Congress Party - Sakshi

సాక్షి, తాడేపల్లి: నరసాపురం మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు సోదరులు గోకరాజు రామరాజు,  గోకరాజు వెంకట నరసింహారాజు, మనుమడు ఆదిత్యలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ వారికి కండువకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేల జీఎస్‌ నాయుడు(నిడదవోలు), ఎం ప్రసాదరాజు(నరసాపురం), కారుమూరి నాగేశ్వరావు(తణుకు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు), మాజీ ఎమ్మెల్యే సర్రాజు తదితరులు పాల్గొన్నారు.

అనంతర వారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. గోకరాజు గంగరాజు కుమారుడు, సోదరులు వైఎస్సార్‌సీపీలో చేరటంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గోకరాజుది జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం అని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయకత్వం బలపరుస్తూ వారు పార్టీలో చేరారని పేర్కొన్నారు. మరికొంత మంది పారిశ్రామికవేత్త వైఎస్సార్‌సీపీలో చేరనున్నారని చెప్పారు.

 
సీఎం ఆశయాలు నచ్చి పార్టీలో చేరా : వెంకట కనక రంగరాజు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శరవేగంతో ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గోకరాజు గంగరాజు కుమారుడు వెంకట కనక రంగరాజు కొనియాడారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సమాజిక అసమానతలను సమతుల్యం చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగిస్తూనే, తనదైన శైలిలో సరికొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు అందుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీర్ఘకాలం సీఎంగా ఉండి పోతారన్నారు. పశ్చిమ గోదావరిలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతల సహకారంతో వారితో కలిసి పని చేస్తానని, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి కుటుంబానికి చేరేందుకు కృషి చేస్తామన్నారు.

గోకరాజు సోదరుడు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్‌ గోకరాజు రామరాజు మాట్లాడుతూ..వైఎస్సార్‌ అంటే తమ కుటుంబానికి ప్రాణమన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరటం​ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు.


గోకరాజు తోడ్పాటు ఉంది: గోకరాజు వెంకట నరసింహారాజు, డీఎన్‌ఆర్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌
పెద్దలు నరసాపురం మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు తోడ్పాటు, అనుమతి, సహకారంతోనే వైఎస్సార్‌సీపీలో చేరామని గోకరాజు గంగరాజు సోదరుడు గోకరాజు వెంకట నరసింహారాజు తెలిపారు. గోకరాజు గంగరాజు రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top