బాబూ ఖబడ్దార్‌.. పిచ్చి వేషాలేస్తే నీ సంగతి చూస్తాం!

Give Huge Mejority to CM KCR, Says Harish Rao - Sakshi

గజ్వేల్‌ సభలో హరీశ్‌ హెచ్చరిక

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని తెలంగాణకు నష్టం చేయాలని చూస్తే.. చంద్రబాబు ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. ‘కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డాడు. బాబు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం. మా వద్ద ఉన్న రికార్డులు ముందుముందు బయటపెడతాం’ అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే చంద్రబాబుతో ప్రచారం చేయించాలని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌కు టికెట్లు, నోట్ల కట్టలు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్.. అన్నీ అమరావతి నుండే వస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ దెబ్బకొడితే కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుందని హెచ్చరించారు. గజ్వేల్‌లో ఆదివారం నిర్వహించిన మైనారిటీల సభలో ఆయన ప్రసంగించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఇప్పటివరకు చేసింది పాతిక శాతం అభివృద్ధి మాత్రమేనని, ఇకముందు భారీస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఢిల్లీకి వినిపించేలా కేసీఆర్‌ను గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో గీతారెడ్డి, నర్సారెడ్ఢి  గజ్వేల్ అభివృద్ధికి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. పార్టీలకతీతంగా కేసీఆర్ గరీబోల్లకు సేవ చేస్తున్నారని, గజ్వేల్‌లో రూ. 2 కోట్లతో షాదీఖానా నిర్మాణంలో ఉందని తెలిపారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ హయాంలో జరిగిందని గుర్తుచేశారు. రంజాన్ పండుగకు వస్త్రాలు పంచడం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణలో మాత్రమే ఆ సంప్రదాయాన్ని కేసీఆర్‌ తెచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి గతంలో ఓటేస్తే ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.

ధర్మం, న్యాయం వైపు టీఆర్‌ఎస్‌..
అభివృద్ధి, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, ధర్మం, న్యాయం వైపు టీఆర్ఎస్ నిలబడిందని హరీశ్‌ రావు అన్నారు. కాంగ్రెస్ క్వార్టర్ సీసాలు, చంద్రబాబు డబ్బులు వద్దని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్‌లో రూ. 250 0 కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పారు. ‘గతంలో బీడీ కార్మికులకు రూపాయి పెన్షన్ ఇచ్చారా? చంద్రబాబు ఏపీలో కార్మికులకు ఎందుకు భృతి ఇవ్వలేదు? రూపాయి ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటేస్తారా? పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్‌కు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ మాట్లాడుతూ..
కాంగ్రెస్ మోసం చేసే పార్టీ అని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికు మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top