
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో మంగళవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్పీకి దూరంగా ఉంటున్న నీరజ్ సోమవారమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే నీరజ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. దీనిపై ముందే ఒప్పందం కుదుర్చుకోని పార్టీలో చేరినట్లు సమాచారం. 2007లో చంద్రశేఖర్ మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన స్థానంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికయ్యారు.