50 ర్యాలీలు..100 స్థానాలు

Eyeing 2019 Elections, PM Modi to Address 50 Rallies by Feb Next Year - Sakshi

వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ప్రధాని మోదీ లక్ష్యం

మొత్తం 400 లోక్‌సభ స్థానాల్లో పార్టీ ప్రచారానికి వ్యూహం

న్యూఢిల్లీ/లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 100 పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా 50 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడే సమయానికి మోదీ, అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీతో కలిపి మొత్తంగా 200 ర్యాలీలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ర్యాలీ రెండు మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో జరిగేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో ఎన్నికల ప్రకటనకు ముందే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం 400 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో జరిగే బహిరంగ సభల్లోనూ మోదీ పాల్గొననున్నారు.  

నేటి నుంచి యూపీలో ప్రధాని పర్యటన
ప్రధాని మోదీ యూపీలోని సొంత నియోజకవర్గం వారణాసితోపాటు ఆజంగఢ్, మిర్జాపూర్‌లలో శని, ఆదివారాల్లో పర్యటించనున్నారు. శనివారం వారణాసిలోని కచ్నార్‌లో జరిగే ర్యాలీలో ప్రసంగించి, బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆజంగఢ్‌లో రూ.23వేల కోట్లతో నిర్మించనున్న లక్నో–ఘాజీపూర్‌ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేకు శంకుస్థాపన చేసి, అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదివారం మిర్జాపూర్‌లో బన్‌సాగర్‌ కెనాల్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top