‘13 మంది రక్తం తాగిన పళనిస్వామి ప్రభుత్వం’

DMK Leader Kanimozhi Slams Palaniswami Government Become Bloodthirsty - Sakshi

సాక్షి, చెన్నై: పళనిస్వామి ప్రభుత్వం రక్తం రుచి మరిగిందని డీఎంకే నాయకురాలు కనిమొళి మండిపడ్డారు. తూత్తుకుడి (ట్యూటికోరిన్‌)లో వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్‌ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడానికి స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు మంగళవారం నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. వారికి సంతాపం ప్రకటిస్తూ కనిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం తూత్తుకుడిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీఎంకేతో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న కనిమొళితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. స్టెరిలైట్‌ పరిశ్రమ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఎదురు తిరిగిన అమాయకులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 13 మందిని పొలీసుల తూటాలు బలితీసుకుంటే ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో వారు మృతి చెందారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని కనిమొళి మండిపడ్డారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

పరిస్థితి అదుపులోనే ఉంది..
తూత్తుకుడిలో ప్రజా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మురళీ రాంబ తెలిపారు. పరిస్థితిలో అదుపులోనే ఉందనీ.. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పట్టణంలో సరిపడా బలగాలను మోహరించామని అన్నారు. కాగా, ప్రజల ఆందోళనల నేపథ్యంలో పర్యావరణ హితం కోరి స్టెరిలైట్‌ పరిశ్రమ విస్తరణను నిలిపి వేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు పరిశ్రమకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. 

‘ప్రభుత్వం స్టెరిలైట్‌ పరిశ్రమపై తీసుకునే చర్యలపై ఒక స్పష్టత వచ్చింది. పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది’అని తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరి తెలిపారు. టీఎన్‌పీసీబీ అనుమతులను రెన్యువల్‌ చేయకుండానే పరిశ్రమను నడపాలని చూస్తున్నారని కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top