ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. దినకరన్ పోటీ

Dinakaran will Contest RK Nagar Bypoll - Sakshi

సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అదిరిపోయే ట్విస్ట్‌. ఎన్నికలో తానే స్వయంగా దిగుతున్నట్లు శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌ ప్రకటించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... స్వయంగా నేనే బరిలో దిగబోతున్నా.. పోటీకి ఎవరొచ్చినా గెలుపు నాదే అంటూ ఆయన తెలిపారు.  

బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా దినకరనే పోటీలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం ద్వారా అమ్మకు అసలైన వారసులం తామేనని (శశికళ వర్గం) నిరూపించుకునే అవకాశం వచ్చిందని దినకరన్‌ చెబుతున్నారు.  జయలలిత మరణంతో దాదాపుగా ఏడాది నుంచి (రాధాకృష్ణన్‌ నగర్‌)  ఆర్కే నగర్‌ నియోజక వర్గంలో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఓటర్లను పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ప్రలోభ పెట్టడం టాక్స్ అధికారుల దృష్టిలో పడటం.. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావటంతో ఎన్నికల సంఘం వాయిదా వేసి విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఉప ఎన్నికపై స్పష్టత ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు స్పందించింది.

డిసెంబర్ 31లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల వేటలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చించాకే అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నాడీఎంకే ప్రకటించగా.. డీఎంకే తరపున దాదాపు అభ్యర్థి ఖరారైనట్లేనని.. మరో వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top