దినకరన్‌కు పచ్చ జెండా

EC Given Green Signal To Dinakaran - Sakshi

గెలుపు ఓకే

పిటిషన్‌ తిరస్కృతి

సాక్షి, చెన్నై : ఆర్కేనగర్‌లో దినకరన్‌ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్కేనగర్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్‌ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు.

భారీ ఆధిక్యంతో విజయ కేత నం  ఎగురవేసిన దినకరన్‌కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్‌ రవి కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జయచంద్రన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్‌ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్‌ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్‌ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్‌కు ఊరట లభించింది. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top