సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడుపుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అక్రమమైన పనులు చేయడానికి అసెంబ్లీని వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం సభను బాయ్‌కాట్ చేస్తే వారి సమస్యను పరిష్కరించేందుకు అధికారపక్షం ప్రయత్నించకుండా, ప్రతిపక్షాన్ని తిట్టేందుకు మాత్రమే సభను నిర్వహించడం దారుణమన్నారు.
ఏపీలో రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశ చట్టాలకు వ్యతిరేకంగా పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు మిన్నకుండిపోయాయని, గవర్నర్, స్పీకర్ వ్యవస్థలు మౌనముద్ర దాల్చాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ధర్మాన డిమాండ్ చేశారు. ప్రతిపక్షం సభకు వచ్చినపుడు ఐదు రోజులకు మించి సభ నడపని ప్రభుత్వం, ఇప్పుడు పదకొండు రోజులుగా అసెంబ్లీని కొనసాగించడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. మరుసటిరోజు సభ ఉందో, లేదో తెలియని పరిస్థితి శాసనసభ్యులకు ఉందని, ఇప్పుడు జరుగుతున్నది ఉత్తుత్తి శాసనసభ అని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే తక్షణమే తాము సభకు హాజరవుతామని ప్రతిపక్షం చెప్పడం రాజ్యాంగ పరిధిలోని డిమాండ్ అని ధర్మాన తెలిపారు.
విపక్షం లేకుండా 22 బిల్లులు పాస్: అసెంబ్లీలో విపక్షం లేకుండా 11 రోజుల్లో 22 చట్ట çసవరణలు చేయడం విడ్డూరమని ధర్మాన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం–2013 తనకు పట్టదన్నట్టు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ చట్టానికి తూట్లు పొడవడం, అసలా చట్టమే వర్తించదని చెప్పడం, సవరణలు చేస్తామనడం ప్రభుత్వ నీతిమాలిన విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు.      
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
