టీడీపీ నేతలను మన్యం నుంచి తరిమికొట్టాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలను మన్యం నుంచి తరిమికొట్టాలి

Published Thu, Oct 18 2018 4:13 AM

CPI Maoist Gopi comments on TDP Leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జిత్తులమారి చంద్రబాబునాయుడు, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటున్నట్టుగా రాష్ట్రం వెలిగిపోవడం లేదన్నారు. బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో.. క్వారీల ముసుగులో మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను మన్యం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు 2019లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల జీవన పరిస్థితి దిగజారిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు.  విశాఖ డివిజన్‌లో అత్యధికంగా అనధికారిక క్వారీలు నడుస్తున్నాయన్నారు.

అనకాపల్లి మండలం సీతానగరం రెవెన్యూ పరిధిలో వెంకుపాలెం పంచాయతీ సర్వే నెంబర్‌ 193లో 2.7 ఎకరాలు, సర్వే నెంబర్‌ 251లో 7.5 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా క్వారీ పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, కిడారి సర్వేశ్వరరావు, అతని బంధువు బుక్కా రాజేంద్ర, కిమిడి రాంబాబు ఇష్టారాజ్యంగా క్వారీల్లో బ్లాస్టింగ్‌లు చేస్తున్నారన్నారు. దీని వల్ల వందల ఎకరాల్లో భూములు సాగుకు దూరమయ్యాయన్నారు. గూడెం మండలం గుమ్మిరేవుల సమీపంలో నల్ల మెటల్‌ క్వారీలో పేలుళ్లకు వాడే మూడు రకాల రసాయనాల కారణంగా అక్కడ చెరువు కలుషితమై 2,050 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వారీల మూలంగా అనకాపల్లి డివిజన్‌లో పదిమంది, మన్యంలో ఆరుగురు మరణించారన్నారు.  
గాలిలో దీపం గిరిజనుల ఆరోగ్యం
జిల్లాలో ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా, 1100 టైఫాయిడ్, 21,800 డయేరియా, 1,660 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. మన్యంలో వైద్యులు అందుబాటులో లేక గిరిజనుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందన్నారు. కడుపు నింపే పౌష్టికాహారం లేక పిట్టాల్లా రాలిపోతున్నారన్నారు. అధికారాన్ని, పదవులను, ధనబలాన్ని అడ్డంపెట్టుని 1/70 చట్టం, పెసాలో 5, 6 షెడ్యూల్, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ ద్రోహులుగా మారిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి, మణికుమారి, ఎం.వి.వి.ప్రసాద్, నాగరాజు, అయ్యన్నపాత్రుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను బాక్సైట్, ఈవో 97, ఏపీఎప్‌డీసీ కాఫీ తోటల పంపకం లాంటి అంశాలపై నిలదీయాలని గిరిజనులను కోరారు. బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లను ముట్టడించాలని, మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యేలు ఈశ్వరి, పీలా గోవిందతోపాటు రాంబాబు, రాజేంద్ర,  నాగరాజు, ప్రసాద్, మణికుమారిలను తరమికొట్టాలని కోరారు. దున్నేవాడిదే భూమి, ఆదివాసీలకే అటవీ హక్కు, గ్రామరాజ్య కమిటీలకే సర్వాధికారం అనే నినాదాలతో మావోయిస్టుల ఆధ్వర్యంలో భూస్వామ్య, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి వర్గంపై మూడు రకాల పోరాటం ఉధృతం చేయాలన్నారు. 

Advertisement
Advertisement