బడ్జెట్ ప్రసంగమా? లేక చంద్రబాబు స్తోత్రమా?

CPI Leader Ramakrishna Comments On AP State Budget 2019 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌ ప్రసంగం సీఎం చంద్రబాబు నాయుడు స్తోత్రంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇది మధ్యంతర బడ్జెటో లేక పూర్తిస్థాయి బడ్జెటో టీడీపీ నాయకులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్‌ రాబోయే ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.  మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడారు.  ఇది కేవలం ఎన్నికల బడ్జెటే అంటూ తేల్చిచెప్పారు. బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప నిజంగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గాలు లేవన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, బాబు మాయ మాటలను నమ్మరని స్పష్టం చేశారు.  

గత నాలుగున్నరేళ్లుగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయని చంద్రబాబు.. రైతులను మరోసారి మోసగించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు సరిగా లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన రైతు రుణమాపీలో ఇంకా రూ.8,200 కోట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌ నాటికి రైతుల అప్పులు రూ.1.37లక్షల కోట్లకు చేరాయని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇళ్ల మంజూరు కేవలం రూ.4,099 కోట్ల రూపాయల కేటాయింపులతో ఎలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top