ధ్యాసంతా మళ్లీ పీఎం కావాలనే

Country may burn but Modi is only interested in becoming PM again  - Sakshi

దళిత–మైనారిటీలపై దాడులు ఆయనకు పట్టవు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ కుంభకోణం సహా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో తాను 15 నిమిషాలు మాట్లాడితే ప్రధాని మోదీ సభ నుంచి పారిపోతారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో సోమవారం ప్రారంభమైన సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌(రాజ్యాంగాన్ని కాపాడండి) కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా, మైనారిటీలపై దాడులు, దళితుల హక్కులకు భంగం కలిగినా, చివరికి దేశం తగలబడిపోయినా మోదీకి పట్టదని మండిపడ్డారు. మోదీ ధ్యాసంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంటుందన్నారు.

కేంద్రం అన్ని వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతోనే నింపేస్తోందని దుయ్యబట్టారు. మోదీ గతంలో ఇచ్చిన ‘బేటీ బచావో–బేటీ పఢావో’ నినాదం ప్రస్తుతం ‘బీజేపీ నేతల నుంచి మీ కుమార్తెల్ని కాపాడుకోండి’గా మారిపోయిందన్నారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి తమ మనసులోని మాటను(మన్‌కీ బాత్‌) చెబుతారని ఆయన చురకలంటించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించగల సత్తా కేవలం కాంగ్రెస్‌ పార్టీకే ఉందని అన్నారు.  గతంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాసినా, విమర్శించినా మీడియాకు అండగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మీడియాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో మీడియా స్వేచ్ఛగా మాట్లాడే రోజులొస్తాయన్నారు.

వంశపారంపర్యాన్ని కాపాడే కార్యక్రమం..
వంశపారంపర్యమైన పాలనను కాపాడుకోవడానికే రాహుల్‌ ‘సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాకుండా వంశపారంపర్య పాలను కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ రూపొందించిందని రాహుల్‌ చెప్పడం బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానించడమేనని షా విమర్శించారు. కాగా, రెండు లోక్‌సభ ఎన్నికల్లో అంబేడ్కర్‌ ఓటమికి నెహ్రూ వ్యక్తిగతంగా కృషి చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top