అనర్గళ విద్యా ‘సాగరు’డు

The Constitutional Position That Doing Chennamaneni Vidyasagar Rao - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రాజకీయాల్లో తలపండిన నేతలు.. కాకలు తీరిన యోధులు.. ఒక్కసారైనా రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న గవర్నర్‌ పదవి చేపట్టాలని ఆశిస్తారు. అలాంటి రాజ్యాంగపరమైన పదవిలో రాణిస్తున్నారు చెన్నమనేని విద్యాసాగర్‌రావు (77). మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న విద్యాసాగర్‌రావు 2014 ఆగస్ట్‌ 30న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విద్యాసాగర్‌రావు మూడుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా.. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి గవర్నర్‌ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి విద్యాసాగర్‌రావు. మొదటి వ్యక్తి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి. పిట్టకథలు, వాగ్దాటితో ఆకట్టుకునే ‘సాగర్‌జీ’ ప్రస్థానంపై కథనం..

విద్యార్థి దశలో రచన, రాజకీయం.. 
విద్యాసాగర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా వర్సిటీ స్థాయి ఎన్నికల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చదివారు. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లారు. జైలులో ఉండగా పలు కథలు, వ్యాసాలు రాశారు. విద్యాసాగర్‌రావు సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు కమ్యూనిస్టు నేతగా ఉండగా విద్యాసాగర్‌రావు మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా పనిచేశారు. 1983లో తొలిసారి కరీంనగర్‌ జిల్లా చొప్పదం డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.

1985లో మెట్‌పల్లి నుంచి పోటీచేసిన విద్యాసాగర్‌రావు ఆపై 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయా లు సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 1998లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి 12వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో 1999లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.  
 

కేసీఆర్‌పై పోటీ..
2004 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఉద్యమ నేతగా కరీంనగర్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేయగా అప్పటికే సిట్టింగ్‌ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్‌రావు మూడోసారి బరిలో దిగారు. తెలంగాణ వాదం బలంగా ఉండటంతో విద్యాసాగర్‌రావు ఓటమిపాలయ్యారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన విద్యాసాగర్‌రావు తన సోదరుడు రాజేశ్వర్‌రావు, తనయుడు రమేశ్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యా రు. బాబాయిని ఓడించిన అబ్బాయిగా రమేశ్‌బాబు వార్తల్లో నిలిచారు. 2014లో కరీంనగర్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్‌రావు మరోసారి ఓటమిపాలయ్యారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా..
తెలంగాణ ప్రాంత సీనియర్‌ బీజేపీ నేతగా గుర్తింపు పొందిన విద్యాసాగర్‌రావు 2014లో బీజేపీ సర్కార్‌ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మహారాష్ట్ర  గవర్నర్‌గా 2014 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన సందర్భంగా తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలను నిశితంగా గమనించిæనాటి తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. 

మాటల మరాఠీ..
విద్యాసాగర్‌రావుకు మాటల మాం త్రికుడని పేరు. వేదికలపై అనర్గళంగా మాట్లాడుతూ కుల సంఘాల పేర్లను ఉచ్చరిస్తారు. ప్రసంగం మధ్యలో పిట్టకథలు చెబుతూ సభికులను ఆకట్టుకుంటారు. అసెంబ్లీ వేదికగా సాగే చర్చల్లోనూ తనదైన శైలిలో సాధికారంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. సభ ఏదైనా తన వాగ్ధాటితో మెప్పిస్తారు. విద్యాసాగర్‌రావును ముద్దుగా ‘సాగర్‌జీ’ అంటారు. ప్రసంగం మధ్యలో చమత్కారాలు, తెలంగాణ నుడికారాలు, సామెతలు చెబుతూ రక్తికట్టిస్తారు. ఇంతట ‘మాటల నేత’ ప్రస్తుతం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కమాటా మాట్లాడకుండా గంభీరంగా ఉండటం విశేషం.

కుటుంబమంతా..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోనరావుపేట మండలం నాగారానికి చెందిన చెన్నమనేని శ్రీనివాస్‌రావు–చంద్రమ్మ దంపతుల చిన్నకొడుకుగా 1942 ఫిబ్రవరి 12న జన్మించిన విద్యాసాగర్‌రావు పాఠశాల స్థాయి నుంచే చురుకైన వక్త. ఆయన భార్య వినోద. పిల్లలు వివేక్, వినయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. చిన్నబ్బాయి వికాస్‌ డాక్టర్‌. విద్యాసాగర్‌రావు పెద్దన్నయ్య రాజేశ్వర్‌రావు సీనియర్‌ రాజకీయ నేత కాగా మరో అన్నయ్య పద్మవిభూషణ్‌ హన్మంతరావు ఆర్థికవేత్త. ఇంకో అన్నయ్య వెంకటేశ్వర్‌రావు కమ్యూనిస్టు నాయకుడు. విద్యాసాగర్‌రావు సోదరి కుమారుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రస్తుత కరీంనగర్‌ ఎంపీ కాగా సోదరుడు రాజేశ్వరరావు కొడుకు రమేశ్‌బాబు వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. 

సొంత డబ్బుతో స్కూలు, చెరువు..
నాగారంలోని రెండున్నర ఎకరాల భూమిని గురుకుల విద్యాలయానికి దానంగా ఇచ్చారు. గ్రామం లోని 85 మంది రైతులకు రూ.1.32 కోట్ల సొంత ఖర్చులతో బోర్లు వేయించారు. 105 మంది పేద బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇళ్లు కట్టించారు.  1993లో నాగారంలో రూ.60 లక్షలతో తొలి ఊట చెరువు నిర్మించారు. తల్లి చంద్రమ్మ పేరిట ట్రస్ట్‌ పెట్టి సిరిసిల్లలో సాగునీటి కాలువలు తవ్వించారు. కార్గిల్‌ వీరుల స్మారకార్థం 2000లో కార్గిల్‌ లేక్‌ను ఏర్పాటు చేశారు. 

- వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top