ఫీజు బకాయిల్లో రూ.600 కోట్లు వీలైనంత త్వరగా విడుదల చేస్తామన్న ప్రభుత్వం
మిగతా బకాయిలు భవిష్యత్తులో ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
అంగీకరించిన కాలేజీల యాజమాన్యాలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్న సర్కారు
రీయింబర్స్‌మెంట్ హేతుబద్ధీకరణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి. ఇప్పటికే టోకెన్లు విడుదల చేసిన మొత్తంలో రూ.600 కోట్లు వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన బకాయిలను భవిష్యత్తులో చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
కాగా సమ్మె విరమిస్తున్నట్టు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు కాలేజీలు దాదాపు ఏడాదిగా ఆందోళన చేస్తున్నాయి. గత ఏడాది పరీక్షలు కూడా బహిష్కరిస్తామని హెచ్చరించాయి. అయితే అప్పట్లో అధికారులు నచ్చజెప్పారు. కానీ బకాయిలు విడుదల కాకపోవడంతో తాజాగా సోమవారం నుంచి అన్ని కాలేజీలను బంద్ చేస్తున్నట్టు యాజమాన్యాలు నోటీసు ఇచ్చాయి.
దీంతో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. ఆదివారం మొదలైన చర్చలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. తర్జనభర్జనలు, వాదోపవాదాల తర్వాత ఎట్టకేలకు చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అనంతరం మంత్రులు, యాజమాన్య సంఘాల ప్రతినిధులతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు.
ఇది మాకెంతో ప్రాధాన్యతాంశం: డిప్యూటీ సీఎం
ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పేద వర్గాల విద్యకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, దీన్ని తాము కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని, బకాయిలు చెల్లించలేదని విమర్శించారు.
వారు వారసత్వంగా ఇచ్చిన బకాయిలు తమకు భారంగా మారాయన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపామని, చర్చలు సానుకూలంగా ముగిసాయని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించి సమ్మె విరమించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 
కాలేజీల యాజమాన్యాలతో సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించామని, త్వరలోనే ఆదేశాలు వెలువడతాయని వెల్లడించారు. హేతుబద్ధీకరణలో యాజమాన్యాలు, మేధావుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
డిగ్రీ, పీజీ కాలేజీల అసంతృప్తి!
చర్చలపై ఇంజనీరింగ్ కాలేజీలు సంతృప్తి వ్యక్తం చేస్తే పీజీ, డిగ్రీ కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మీడియా సమావేశానికి కూడా వారు దూరంగా ఉన్నారు. తమ బకాయిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని, కాలేజీలు నడపాలా? సమ్మెకు వెళ్లాలా? అనే దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఆయా కాలేజీల ప్రతినిధులు తెలిపారు. చర్చల్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


