రాహుల్‌పై హత్యాయత్నమా?

Congress Writes Letter To Home Minister On Murder Attempt on Rahul Gandhi - Sakshi

స్నైపర్‌ తుపాకీకి అమర్చిన లేజర్‌ లైట్‌ పడిందన్న కాంగ్రెస్‌ 

 ఏడుసార్లు రాహుల్‌ గాంధీ తలకు గురిపెట్టారని ఆరోపణ

కేంద్ర హోంమంత్రికి లేఖ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హత్యకు ఎవరైనా కుట్ర పన్నారా? అమేథీలో నామినేషన్‌ దాఖలుచేసిన అనంతరం ఆయన్ను స్నైపర్‌ తుపాకీతో చంపేందుకు ప్రయత్నించారా? అంటే కాంగ్రెస్‌ వర్గాలు అవుననే జవాబు ఇస్తున్నాయి. బుధవారం యూపీలోని అమేథీలో రాహుల్‌ తలపై కనీసం ఏడుసార్లు ఆకుపచ్చ రంగు లేజర్‌ లైట్‌ తాకిందనీ, ఇలాంటి లేజర్‌ను స్నైపర్‌ తుపాకుల్లోనే వాడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాసింది. 

కణతపై గురిపెట్టారు.. 
కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్‌ సూర్జేవాలా సంతకం చేసిన ఈ లేఖలో కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ.. ‘యూపీలోని అమేథీలో నామినేషన్‌ అనంతరం రోడ్‌షో, మీడియా సమావేశం నేపథ్యంలో రాహుల్‌ తలపై ఏడుసార్లు లేజర్‌ లైట్‌ పడింది. వీటిలో రెండు సార్లు రాహుల్‌ కణతపైనే గురిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన మాజీ భద్రతాధికారులు.. ఇలాంటి లేజర్‌ లైట్లు కేవలం స్నైపర్‌ గన్‌లాంటి అత్యాధునిక ఆయుధాల్లోనే ఉంటాయని తేల్చారు. ఇలాంటి ఘటన జరగడం రాహుల్‌ గాంధీ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. రాహుల్‌ గాంధీ ప్రస్తుతం హైరిస్క్‌ టార్గెట్‌గా ఉన్నారు. ఆయన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరిని (ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ) ఉగ్రశక్తులు హత్యచేశాయి. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని హోంశాఖను కోరుతున్నాం. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాహుల్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని తెలిపింది. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కిందకు జారిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ ఆటో–పైలట్‌ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించింది. 

అది తుపాకీ కాదు: హోంశాఖ 
రాహుల్‌ గాంధీపై హత్యాయత్నానికి గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారన్న కాంగ్రెస్‌ పార్టీ వాదనను కేంద్ర హోంశాఖ ఖండించింది. ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై హోంశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘రాహుల్‌పై లేజర్‌ లైట్‌ పడిందన్న వార్తలు మీడియాలో రాగానే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) డైరెక్టర్‌ను హోంశాఖ ఆదేశించింది. ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీజీ నిపుణుల బృందం.. అందులోని ఆకుపచ్చ రంగు లేజర్‌ లైట్‌ ఏఐసీసీ ఫొటోగ్రాఫర్‌ ఫోన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించింది. రాహుల్‌ రోడ్‌ షోతో పాటు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఫొటోగ్రాఫర్‌ రాహుల్‌ వీడియోలను ఫోన్‌ ద్వారా చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎస్పీజీ డైరెక్టర్‌ హోంశాఖతో పాటు రాహుల్‌ వ్యక్తిగత సిబ్బందికి చెప్పారు’ అని అన్నారు. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ లేఖ రాయలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top