కర్షకులను మోసగించిన కాంగ్రెస్‌

Congress used farmers as vote bank, betrayed them - Sakshi

దేశానికి అన్నదాతలే ఆత్మ

పంజాబ్‌ రైతు ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ

మలౌత్‌(పంజాబ్‌):  రైతాంగానికి కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని, దేశానికి వెన్నెముకలాంటి రైతులను ఆ పార్టీ ఓటు బ్యాంకులా చూసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాల విధానాల కారణంగా రైతులు నిరాశ, నిరుత్సాహంతో జీవితాలను గడపాల్సి వచ్చేదని చెప్పారు. ‘గత కొన్నేళ్లుగా మీరు పెట్టిన పెట్టుబడికి 10 శాతం లాభమే ఎందుకు పొందుతున్నారో నాకు తెలుసు. దీని వెనుక ఉన్న విషయం ఏమిటో  తెలుసు. రైతులు దేశానికి ఆత్మవంటి వారు. వారే మన అన్నదాతలు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ వారిని అన్నివేళలా మోసం చేసింది.రైతులను కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగానే చూసింది’’అని చెప్పారు. బుధవారం పంజాబ్‌లోని మలౌత్‌లో నిర్వహించిన ఓ రైతు ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఇటీవల ఖరీఫ్‌ పంటలకు కేంద్రప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని పెంచిన నేపథ్యంలో బీజేపీ ఈ ర్యాలీచేపట్టింది. కిసాన్‌ కల్యాణ్‌ ర్యాలీ పేరిట నిర్వహించిన బహిరంగ సభకు హరియాణా సీఎం ఖట్టర్, పంజాబ్‌ మాజీ సీఎం బాదల్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌బాదల్‌ తదితరులు హాజరయ్యారు.

నాలుగేళ్లుగా రికార్డు స్థాయి ఉత్పత్తి
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. గత నాలుగేళ్లుగా రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్నారని, వారికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. వరి, గోధుమ, పత్తి, చెరకు, పప్పులు ఏ పంటలైనా గత రికార్డులను బద్ధలు కొడుతున్నాయన్నారు. తన ప్రసంగం సందర్భంగా కొన్ని మాటలను పంజాబీలో మాట్లాడి రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

పంజాబీలు సరిహద్దుల్లో పోరాడుతున్నారని, పంజాబ్‌ దేశానికి స్ఫూర్తిని అందిస్తుందని చెప్పారు. రైతులు కోతలు పూర్తయిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టవద్దని సూచించారు. ఈ సమస్యను అధిగమించేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ కోసం రూ.50 కోట్లు కేటాయించామని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ కోసం యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top