రైతుకు రుణ విముక్తి

Congress releases party manifesto for Lok Sabha elections - Sakshi

ఏటా ప్రత్యేకంగా కిసాన్‌ బడ్జెట్‌

ఆరోగ్య సంరక్షణ హక్కుకు చట్టం

న్యాయ్‌తో పేద కుటుంబాలకు ఏటా రూ.72 వేలు

ప్రభుత్వ రంగంలో 34 లక్షల ఉద్యోగాల భర్తీ

జీఎస్టీలో ఒకే రేటు అమలు 55 పేజీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో  

న్యూఢిల్లీ: నిరుద్యోగులు, పేదలు, మహిళలు, రైతుల ఓట్లే లక్ష్యంగా ఆకర్షణీయ తాయిలాలతో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అధికారంలోకి వస్తే ఏటా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతామని, ఓ మోస్తరు రేటుతో జీఎస్టీలో ఒకే రేటును అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చింది. రైతులకు రుణమాఫీ కాకుండా, నేరుగా రుణాల నుంచే విముక్తి కల్పిస్తామని వాగ్దానం చేసింది. అధ్యక్షుడు రాహుల్‌ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం ‘న్యాయ్‌’కు జాబితాలో పెద్దపీట వేసింది. ‘మేము నెరవేరుస్తాం’ పేరిట రూపొందించిన 55 పేజీల ఈ మేనిఫెస్టో పత్రాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీయే చైర్‌పర్సన్‌ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌æ, చిదంబరం తదితరులు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు.  

► కోట్లాది మందికి గొంతుక: రాహుల్‌
ఐదేళ్ల పాలనలో బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేషం, విభజన రేఖల్ని విస్తరించిందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రజలను సమైక్యపరచడానికి కాంగ్రెస్‌ పాటుపడుతుందని తెలిపారు. తమ మేనిఫెస్టో ఫలానా వ్యక్తి మనోగతం కాదని, కోట్లాది ప్రజలకు గొంతుక అని పేర్కొన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛ, మర్యాద, ఆత్మగౌరవం, అభివృద్ధికి అలుపెరగకుండా కృషిచేస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అని చాటిచెప్పేలా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఆయా రంగాల వారీగా..

► వ్యవసాయం
పంటలకు మెరుగైన మద్దతు ధరలు కల్పించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తాం. వ్యవస్థాగత రుణ పరపతి సౌకర్యం రైతులందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం. ఈ చర్యలతో రైతు ‘రుణమాఫీ’ నుంచి రైతుకు ‘రుణాల నుంచి విముక్తి’ కల్పించే దిశగా సాగుతాం. ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతాం.

► విద్య, వైద్యం
విద్య, వైద్యానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 12 తరగతుల వరకు ఉచిత, నిర్బంధ విద్యను అమలుచేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను పరిపుష్టం చేసి పేదలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తాం. ఆరోగ్య సంరక్షణ హక్కు చట్టం రూపొందించి ప్రతి పౌరుడికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా పేదలకు ఉచితంగా ఓపీ సేవలు, ఔషధాలు, వైద్యం అందిస్తాం.

► న్యాయ్‌
దేశంలో అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు కనీస ఆదాయ హామీ కింద ఏటా రూ.72 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. పేదరికంపై నిజమైన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఇదే కాబోతోంది. ఈ పథకం కోసం తొలి ఏడాది జీడీపీలో 1 శాతం, రెండో ఏడాది 2 శాతం ఖర్చు చేస్తాం.

► ఏపీకి ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తాం. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటాం. పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తాం. ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సంపూర్ణ అధికారాల్ని కేవలం మూడింటి(రెవెన్యూ, పోలీస్, శాంతిభద్రతలు)కే పరిమితం చేస్తూ చట్ట సవరణ చేస్తాం.  

► ఉపాధి
ప్రభుత్వ రంగంలో 34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అందులో 4 లక్షల ఖాళీల్ని 2020 మార్చి నాటికే నింపుతాం. మరో 20 లక్షల ఖాళీల్ని భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల్లో కొత్తగా 10 లక్షల సేవా మిత్ర ఉద్యోగాల్ని సృష్టిస్తాం. ఉద్యోగ కల్పనతో పాటు మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రైవేట్‌ సంస్థలకు ప్రోత్సాహకాలిస్తాం.

► జీఎస్టీ సంస్కరణలు
ఒకే ఒక మోస్తారు రేటు ఉండేలా వస్తు, సేవల పన్ను జీఎస్టీలో సమూల మార్పులు తెస్తాం. ఎగుమతులు, అత్యవసర వస్తువులు, సేవలకు పన్ను మినహాయింపునిస్తాం. జీఎస్టీ ఆదాయంలో పంచాయతీలు, మునిసిపాలిటీలకు వాటా కేటాయిస్తాం. రిజర్వ్‌ బ్యాంకు విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా చూస్తాం.

► గ్రామీణాభివృద్ధి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 150 రోజులకు పెంచుతాం. 250 మంది జనాభా ఉన్న గ్రామాలన్నింటిని పక్కా రోడ్లతో అనుసంధానిస్తాం. ఇళ్లు, సొంత భూమిలేని ప్రతి కుటుంబం సొంతిళ్లు కలిగి ఉండేలా ప్రత్యేక చట్టం తెస్తాం.

► మహిళా సాధికారత
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కొత్తగా కొలువుదీరబోయే లోక్‌సభ తొలి సమావేశంలోనే ఆమోదం తెలుపుతాం. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పస్తాం.

► విద్వేష నేరాల కట్టడి
మూక హత్యలు, విద్వేష నేరాల నియంత్రణకు పార్లమెంట్‌ తొలి సెషన్‌లోనే నూతన చట్టం తెస్తాం. బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉన్నతాధికారుల్ని బాధ్యుల్ని చేసేలా నిబంధనలు రూపొందిస్తాం.

దేశాన్ని ముక్కలు చేస్తుంది: బీజేపీ
కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో ఆచరణీయ సాధ్యం కాదని, అది ప్రమాదకరంగా, దేశాన్ని ముక్కలుగా విడగొట్టేలా ఉందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాల్ని బట్టి చూస్తే ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా పొందే అర్హత లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో కనీసం కంటితుడుపుగానైనా రుణమాఫీని అమలుచేయలేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి మేనిఫెస్టోలో చేర్చిన భాగాల్ని రాహుల్‌ సన్నిహితులు(2016లో జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని ఉద్దేశించి) రచించారేమోనని సందేహం వ్యక్తం చేశారు. దేశద్రోహం చట్టాన్ని రద్దుచేస్తామని ప్రకటించడంపై స్పందిస్తూ..జిహాదీలు, మావోయిస్టుల చెప్పుచేతల్లో కాంగ్రెస్‌ ఉండటం ఇకపై నేరం కాబోదని ఎద్దేవా చేశారు. న్యాయ్‌ పథకం అమలుకు కాంగ్రెస్‌ నేతలు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ పథకానికి నిధుల సమీకరణ కోసం కొందరేమో పన్నులు పెంచాలని సూచించారని, మరి కొందరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అన్నారని తెలిపారు.  

వయనాడ్‌ నుంచే పోటీ ఎందుకంటే...
మోదీ దక్షిణాదిపై విద్వేషం పెంచుకున్నట్లు అక్కడి ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. దక్షిణ భారత ప్రజలకు మద్దతుగా ఉన్నానని తెలిపేందుకే వయనాడ్‌ నుంచి పోటీచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమని కలుపుకుపోవడం లేదని, కీలక నిర్ణయాల్లో తమ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని దక్షిణాది ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు వయనాడ్‌లో కూడా రాహుల్‌ పోటీచేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

పొత్తులకు సిద్ధమే: దేశవ్యాప్తంగా పొత్తులకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని రాహుల్‌ చెప్పారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తుపై సందిగ్ధత నెలకొనడంపై ఓ విలేకరి ప్రశ్నించినపుడు ఆయన ఇలా స్పందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలసి పనిచేయడం లేదన్న వార్తల్ని తోసిపుచ్చారు. మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో ముందస్తు అవగాహన కుదుర్చుకున్న సంగతిని ప్రస్తావించారు. అనంతరం ఆప్‌ స్పందిస్తూ పొత్తు కుదుర్చుకునేందుకు ఉన్న అవకాశాలపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతామని వెల్లడించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top