కేసీఆర్‌నే కాంగ్రెస్‌లో చేర్పిస్తా..!

Congress MLA Komatireddy Rajagopal Reddy Slams TRS In Munugodu - Sakshi

మునుగోడు: టీఆర్‌ఎస్‌ పార్టీకి భయపడి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తూ పార్టీ లోనే కొనసాగుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌నే కాంగ్రెస్‌లోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన నియోజకవర్గస్థాయి కృతజ్ఞతాభినందన సభలో ఆయన మాట్లాడారు. తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానన్న ప్రచారం అవాస్తవం అని అన్నారు. సీఎం కేసీఆర్‌ జిమ్మిక్కులు చేసి ఈ ఎన్నికల్లో గెలిచారని, ఆ పార్టీకి అన్ని సీట్లు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కోదాడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలలో ఓటర్లు వేసిన ఓట్ల కంటే అదనంగా పోలైయినట్లు ఆరోపించారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని, రానున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని రాహుల్‌ గాంధీని ప్రధాని చేసి తీరుతానన్నారు. ఇందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ గతంలో, ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటు కు గురైన మునుగోడుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే తాను ఎమ్మెల్సీ పదవిని వదులుకొని వచ్చానని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు మహాకూటమి అభ్యర్థులతో కలిసి సీఎంపై పోరాడి చెర్లగూడెం రిజర్వాయర్‌ పనులు పూర్తి చేయించి సాగునీరు అందిస్తానని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత, పల్లె రవికుమార్, కర్నాటి వెంకటేశం, వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top