వేదిక మీదే కొట్లాట.. కాంగ్రెస్‌ లీడర్ల డిష్షూం డిష్షూం

Congress Leaders V Hanumanta Rao, Nagesh Fight At Indira Park - Sakshi

బాహాబాహీకి దిగిన హనుమంత రావు, నగేశ్‌

వేదిక మీద పరస్పరం తోపులాట.. చేయి చేసుకున్న నేతలు

బిత్తరపోయిన అఖిలపక్షం నేతలు.. పోయి గాంధీభవన్‌లో కొట్టుకోవాలని వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంత రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్‌ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్‌ మాట్లాడుతుండగా, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ మైక్‌లో వీహెచ్‌ అనౌన్స్‌ చేశారు. అదే సమయంలో నగేశ్‌ కూడా వేదికపైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేశ్‌ కూర్చునేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో నగేశ్, వీహెచ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. నగేశ్‌పై వీహెచ్‌ చేయి చేసుకోవడంతో నగేశ్‌ వీహెచ్‌ చొక్కా పట్టుకున్నాడు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోవడంతో అక్కడున్న వారు వీహెచ్‌ను పైకిలేపి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏకంగా వేదిక మీదే కాంగ్రెస్‌ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోండంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.  

నగేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచన! 
ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ఘర్షణ పడటాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణించింది. శనివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా భేటీ అయింది. కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ గొడవపై చర్చించారు. సీనియర్‌ నేత వీహెచ్‌పై నగేశ్‌ దాడి చేసినట్లుగానే భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. నగేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు... దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్‌ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా నగేశ్‌పై చర్యలు తీసుకోనున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top