దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను గమనిస్తోంది!

Congress Leaders Shabbir, Sarve Slams KCR - Sakshi

కేసీఆర్‌, మోదీ కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారు

కేసీఆర్‌కు ఓటేస్తే.. మోదీకి వేసినట్టే..

మైనారిటీల సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు..

సాక్షి, హైదరాబాద్‌ : దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందని, ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణను మోసం చేయాలని చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని గాజులరామారంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం నిర్వహించిన మైనారిటీలో సమావేశంలో షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు గుణపాఠం కాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మైనారిటీల పక్షపాతి అని, పేద ముస్లింల కోసం వైఎస్సార్‌ హయాంలో ఎన్నో పథకాలను కాంగ్రెస్‌ అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు.

కేసీఆర్‌కు ఓటు వేస్తె మోదీకి వేసినట్టేనని, కేసీఆర్ ఊసరవెల్లిలాంటి వారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్ మైనారిటీలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్‌లో ఎస్సీలకు, మహిళలకు చోటు దక్కలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పార్లమెంటులో తాము పోరాటం చేసినపుడు కేసీఆర్ లేరని పేర్కొన్నారు. డైనమిక్ యువ నేత రేవంత్ అంటే కేసీఆర్‌కు భయమన్నారు.

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. చిన్న దొంగ కేసీఆర్ అయితే.. పెద్దదొంగ నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని, కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల అభివృద్ధి  జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top