టీడీపీతో పొత్తొద్దు!

Congress Leaders Does Not Want Alliance With TDP - Sakshi

ఆ పార్టీతో కొనసాగితే మనుగడ సాగించలేం.. టీ కాంగ్రెస్‌ సీనియర్ల మనోగతం

అధిష్టానం స్పందించకుంటే ‘లోక్‌సభ’లో ఎవరూ నిలవరు

టీడీపీతో పొత్తు వల్లే ఘోరంగా ఓడాం

అన్నిచోట్లా ఓటు బ్యాంకుకు గండి పడింది

సీపీఐ, టీజేఎస్‌లతోనే వెళ్లుంటే మరో 20 సీట్లు వచ్చేవి

ఫలితాలు సమీక్షించుకోవాలి: కోమటిరెడ్డి

ఇకనైనా ప్రజల మనసు గుర్తించాలి: రవీంద్ర నాయక్‌

అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం: పొంగులేటి  

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు... టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు అంశం కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో మైత్రి అంటే... తెలంగాణలో మనుగడ సాగించలేమని, పోటీ చేసేందుకు కూడా నాయకులు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడతాయని సీనియర్లు అంటు న్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌ అధినాయకత్వానికి తెలుసునని, తరువాత ఎన్నికలకు వ్యూహం ఎలా ఉండాలన్నది కూడా వారికి తెలియదని అనుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.  

ఆ పొత్తే మమ్మల్ని ముంచింది... 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని సమీక్షించుకుం టున్న టీపీసీసీ ముఖ్యులు టీడీపీతో పొత్తు తమ పుట్టి ముంచిందనే నిర్ధారణకు వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకంటే టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ ఎన్నికలను హైజాక్‌ చేయడం వల్లే ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు తమపై ఉన్న సానుభూతి కూడా బాబుతో పొత్తు తర్వాత ఆగ్రహంగా మారిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీపీఐ, తెలంగాణ జనసమితితోనే పొత్తుకు పరిమితమై ఎన్నికలకు వెళ్లుంటే సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలుండేవి కావనీ, కనీసం మరో 20 సీట్లలో మెరుగైన ప్రతిభ సాధించగలిగేవారమని వారంటున్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని ఓసారి, తాను చేసిన దాన్ని కాంగ్రెస్‌ పార్టీ కొనసాగించిందని మరోసారి చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు... తన రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వడం మాత్రం మర్చిపోయారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతోపాటు కూటమిలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇచ్చినట్లు బహిర్గతం కావడమే తమ కొంప ముంచిందని వాపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రమేయాన్ని అంగీకరించే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదని ఈ ఎన్నికల ఫలితాలతో అర్థమైందని, అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి తెలంగాణ వరకైనా టీడీపీతో పొత్తు నుంచి మినహాయింపునివ్వాలని వారు కోరుతున్నారు. ‘మంచో చెడో ఓసారి పొత్తు పెట్టుకున్నాం. దాని పర్యవసానాలు అనుభవించాం. ఇకనైనా తెలంగాణ ప్రజల మనసెరిగి వ్యవహరిస్తే బాగుంటుంది’అని టీపీసీసీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌ అన్నారు. 

పట్టణ ఓట్లూ గల్లంతు... 
టీఆర్‌ఎస్‌ పాలనలో అమలైన సంక్షేమ పథకాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి సానుకూలత మొదటి నుంచి కనిపించినా, పట్టణ ప్రాంత ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, ఉద్యోగ వర్గాలు తమవైపే ఉన్నారని ఎన్నికల ముందు వరకు ధీమాగా ఉన్నారు. ఈ ఓట్లు తమ విజయాన్ని సులభతరం చేస్తాయని ఆశించారు. కానీ చంద్రబాబు ప్రవేశంతోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి, యువత, ఉద్యోగ వర్గాలకు ఆ సమయంలో చంద్రబాబు నిర్వహించిన పాత్ర గుర్తుకు వచ్చిందని... దీంతో ఉన్నట్లుండి తమవైపు నుంచి ప్రత్యామ్నాయం వైపు వారి ఆలోచన మళ్లిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకుగా భావించిన వర్గాలన్నీ అనివార్య పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇక పల్లె ప్రాంతాల్లో అక్కడో, ఇక్కడో ఓట్లు లభిస్తాయని ఆశించినా చంద్రబాబు మళ్లీ వస్తున్నాడన్న టీఆర్‌ఎస్‌ ప్రచారం ఆ ఓట్లను కూడా గల్లంతు చేసిందని విశ్లేషిస్తున్నారు. బాబు రాక పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా, గ్రామీణ ప్రాంతాల్లో పాక్షికంగా తమ ఓటు బ్యాంకుకు నష్టం చేసిందనే అంచనాకు కాంగ్రెస్‌ వర్గాలు వచ్చాయి. ‘టీడీపీతో పొత్తు కారణంగా అర్బన్‌లో మేము బాగా దెబ్బతిన్నాం. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాలపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు వద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

పొత్తు కొనసాగితే పోటీ చేయలేం... 
ఎన్నికల ఫలితాలు కొట్టిన దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పార్టీ భవిష్యత్తుపై అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే లోక్‌సభ బరిలో దిగి పార్టీతోపాటు తమ సత్తా చాటాలనే నిర్ణయానికి వస్తున్నారు. అయితే అది కూడా టీడీపీతో పొత్తు వదిలితేనే తాము పోటీకి సిద్ధమవుతామనే మెలిక పెడుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం మారకపోతే తాము ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని, టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్టను నష్టపోవడంకన్నా పోటీలో ఉండకుండా ఉండటమే మేలని, అనివార్యంగా పోటీలో ఉండాల్సిన పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడమే మంచిదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొందరు నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నా మరికొందరు అంతర్గత సమీక్షల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ‘శాసనసభ ఎన్నికల ఫలితాలు సమీక్షించుకొని తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది’అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీలో ‘పచ్చ’పార్టీని వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయంపైనే చర్చ జరుగుతోంది. ‘టీడీపీతో పొత్తు కొనసాగితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనేక మంది పార్టీని వీడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అధిష్షానం సముచితమైన రీతిలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది’అని మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు పేర్కొన్నారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top