వదల తమ్ముళ్లూ.. వదలా!

Conflicts in Udayagiri TDP Party PSR Nellore - Sakshi

హాట్‌ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే బొల్లినేని బకాయిల వ్యవహారం

టీడీపీ నేతలకే రూ.10 కోట్ల బకాయిలు

బకాయిల వ్యవహారంపై ఇంటెలిజెన్స్‌ ఆరా

బొల్లినేనికి మళ్లీ టికెట్‌ అనుమానమే

ఉదయగిరి టీడీపీలో తీవ్ర కలకలం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  అధికార పార్టీలో ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు బకాయిల వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో బకాయిలు, కేసులు వ్యవహారాలతో సతమతమవుతున్న బొల్లినేనికి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గంలో మరో తలనొప్పి ప్రారంభమైంది. బొల్లినేని వ్యాపారులకే కాకుండా ఈ పర్యాయం తెలుగు తమ్ముళ్లకే పనులకు సంబంధించిన బిల్లు బకాయిలు ఉండటంతో అంతా కలిసి కట్టుగా వెళ్లి సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో అభ్యర్థిని మార్చకపోతే పార్టీ భవిష్యత్‌కే ప్రమాదం గట్టిగానే చెప్పడం నియోజకవర్గలో కలకలం రేపింది. దీని కొనసాగింపుగా ఎమ్మెల్యే బొల్లినేని వ్యవహారంపై ఇంటిలిజెన్స్‌ విభాగం ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.

ఉదయగిరి ఎమ్మెలే బొల్లినేని రామారావు ఎమ్మెల్యేతో పాటు కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని ‘విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు’లో లెక్కకు మించి పనులు నిర్వహించడం, భారీగా గోల్‌మాల్‌ చేయడం, అవినీతికి పాల్పడిన క్రమంలో నాగపూర్‌లోని ఏసీబీ అధికారులు, స్థానిక పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. కొంత కాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకాన్ని పూర్తిస్థాయిలో ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీ అంటూ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో లేని ఫైబర్‌ చెక్‌ డ్యాంల్లో నిర్మాణానికి తెరతీశారు. మొత్తం నాలుగేళ్లలో రూ.350 కోట్లకు పైగా నీరు–చెట్టు పనులు జరిగాయి. నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులన్ని ఆయన తన కంపెనీల ద్వారా నిర్వహించారు.

సివిల్‌ వర్క్‌లను స్థానిక అధికార పార్టీ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు అప్పగించారు. పనులన్ని పూర్తయి దాదాపు 10 నెలలు గడిచినా అధికార పార్టీ నేతలకు ఇంకా బిల్లులు రాలేదని చెల్లించలేదు. దీంతో నేతలు గట్టిగా ప్రశ్నిస్తే సీరియస్‌ వార్నింగ్‌లకు దిగుతున్నారు. నియోజకవర్గంలో పనులు నిర్వహించిన వారికి సంబంధించి రూ.28 కోట్లు వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వింజమూరు, కలిగిరి జెడ్పీటీసీ సభ్యులు పులిచర్ల నారాయణరెడ్డి, దామా మహేశ్వరరావు, కలిగిరి ఎంపీపీ వెంకటేశ్వర్లుతో పాటు సుమారు 25 మంది నేతలు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఎమ్మెల్యే అప్పుల వ్యవహారంపై ఫిర్యాదు చేసి ఐదు పేజీల ఫిర్యాదు కాపీని ఇచ్చి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బొల్లినేని రామరావు అభ్యర్థి అయితే పార్టీ నష్టపోతుందంటూ ఫిర్యాదు చేసి మార్చాలని డిమాండ్‌ చేశారు.

ఇంటెలిజెన్స్‌ ఆరా!
ఈ క్రమంలో బొల్లినేని బకాయిల వ్యవహారం, ఇతర అంశాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు అరా తీశారు. ఇరిగేషన్‌ విభాగంలో ఎస్‌ఈ స్థాయి అధికారి మొదలుకొని డీఈ వరకు కొందరితో మాట్లాడి నిర్వహించిన వర్కులు వాటికి సంబంధించిన బిల్లులు ఇతర అంశాలపై వివరాలు తీసుకుని నివేదిక పంపినట్లు సమాచారం. అయితే సీఎం కార్యాలయం నుంచి ఎమ్మెల్యేకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. బకాయిలన్ని చెల్లించి తనను వచ్చి కలవమని సీఎం సూచించినట్లు సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top