
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీసీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సరిపడా సభ్యుల మద్దతు ఉంటేనే వైఎస్సార్ సీపీకి సహకరిస్తామని ఆయన మెలిక పెట్టారు. కొంతమంది కావాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని ఆరోపించారు.
చిత్తశుద్ధితో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం లాలూచీ పడి అవిశ్వాసం పెడితే ఎండగడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియచేస్తూ గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు. విభజనలో హేతుబద్ధత లేకుండా రాష్ట్రానికి అన్యాయం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యేలా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో ఉద్వేగం అధికంగా ఉంటుందని, సున్నిత మనస్కులన్నారు. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడితే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు.