నాడు తొక్కి..నేడు మొక్కుతారా..! | Chandrababu Naidu Government Neglected The EPF System In Badwel | Sakshi
Sakshi News home page

నాడు తొక్కి..నేడు మొక్కుతారా..!

Apr 8 2019 11:26 AM | Updated on Apr 8 2019 11:26 AM

Chandrababu Naidu Government Neglected The EPF System In Badwel - Sakshi

లెనిన్‌ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న జిల్లా ప్యాప్టో నాయకులు(ఫైల్‌), విజయవాడలో ఉపాధ్యాయులను లాగిపడేస్తున్న పోలీసులు (ఫైల్‌)

సాక్షి, బద్వేలు : ఉద్యోగ విరమణ తరువాత భవిష్యత్తుకు భరోసా ఇవ్వని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అలుపెరగని పోరాటాలు చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపించిన వేళ సీపీఎస్‌ రద్దు చేస్తామనడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2004 సెప్టెంబరు నుంచి పాత పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 1.64 లక్షల మంది, జిల్లాలో దాదాపు 15 వేల మంది సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. 2004 నోటిఫికేషన్‌ తరువాత జిల్లాలో 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో మూడు వేల మంది ఉద్యోగాలు పొందారు. వీరంతా సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. 

నాడు అబద్ధాలు...అరెస్టులు
సీపీఎస్‌ ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వం వారిని తప్పుదోవ పట్టించేందుకు అబద్ధాలు చెప్పింది. తొలుత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఉద్యోగులు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో చేసేది లేక వారి నోళ్లు మూయించేందుకు పోలీసులను ఉపయోగించారు. పలుపర్యాయాలు విజయవాడ, గుంటూరులో జరిగిన ఆందోళనల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి వ్యాన్‌ల్లో కుక్కారు. మహిళలు అని చూడకుండా లాఠీలతో కొట్టించి తరిమించారు. 

వైఎస్‌ జగన్‌ హామీతో ఊరట 
రాష్ట్రవ్యాప్తంగా రెండు 1.87 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి కీలకమైన సమస్యకు పరిష్కారం చూపకుండా టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభంలో సెప్టెంబరు 6న సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే సీపీఎస్‌ రద్దు చేసి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దీంతో చేజారిపోతున్న పెన్షన్‌ పథకం తిరిగి తమకు అందుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. 

పాత పథకాన్ని అమలుచేయాలి
సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తేనే ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం సీపీఎస్‌ విధానంలో ఉండి పదవీ విరమణ చేసిన వారికి రూ.650 పెన్షన్‌ రావడం దారుణంగా ఉంది. 35 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందించి, వయస్సు మీద పడిన తరువాత వచ్చే పెన్షన్‌ షేర్‌ మార్కెట్‌పై ఆధారపడటం శోచనీయం.    

 – పుల్లయ్య, సీపీఎస్‌ నాయకులు 

పోరాటాలను పట్టించుకోలేదు
ఉద్యోగ విరమణ తరువాత పింఛన్‌ పొందేలా రాజ్యాంగం కల్పించిన హక్కుకు విఘాతం కలిగిస్తున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడేమో టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేది.    

 – వెంకటరెడ్డి, సీపీఎస్‌ ఉద్యోగి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement