ఓటమి భయం... ఆ వెనుకే భరోసా | Chandrababu Naidu Fire On TDP Leaders | Sakshi
Sakshi News home page

ఓటమి భయం... ఆ వెనుకే భరోసా

May 5 2019 1:15 PM | Updated on May 5 2019 5:12 PM

Chandrababu Naidu Fire On TDP Leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : రానున్న ఎన్నికల్లో గెలుపోటములపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో శనివారం సాగిన సమీక్ష భయం... అంతలోనే భరోసాల మధ్య సాగింది. వరుసగా వస్తున్న సర్వేలు టీడీపీకి వ్యతిరేకంగా ఉండడంతో పోటీదారులతోపాటు క్యాడర్‌ నిరాశా, నిస్పృహలకు లోనుకాకుండా ఉండేందుకు ప్రత్యేక సమీక్షల పేరుతో ఆక్సిజన్‌ ఎక్కించడానికి అన్నట్టుగా ఈ సమావేశం తీరు ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని వదిలేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డారు? ఏ మేరకు నష్టం చేకూర్చారు? వారి వివరాల జాబితా తనకు అందజేయాలంటూ పోటీదారులకు చంద్రబాబు సూచించడంతో పార్టీ నేతలే అవాక్కయ్యారు.

ఫలితాలు వచ్చిన తరువాత చేయాల్సిన పంచాయతీ ముందస్తుగా ఎందుకు చేస్తున్నారని పార్టీ సీనియర్లే జుత్తు పీక్కుంటున్నారు. ‘టీడీపీయే గెలుస్తుంద’ంటూ ధైర్యం నూరిపోయాడానికి ఈ సమావేశం వేదికగా చేసుకుంటున్నారని పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను విజయవాడలో సీఎం చంద్రబాబు శనివారం నిర్వహించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 మంది చొప్పున దాదాపు 280 మంది అభ్యర్థులతో కలిసి హాజరయ్యారు. సమీక్ష ప్రారంభం దగ్గరి నుంచి వన్‌మేన్‌ షోగా నడిచింది. పోలింగ్‌ సరళి, నేతల పనితీరుపై చర్చించకుండా ఏక బిగువున సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎవరికీ పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తాను చెప్పాల్సిందంతా చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఎన్నికల్లో మనపై ఎన్నో కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఛేదించుకుని ముందుకెళ్లామని, అయినప్పటికీ ఓటర్లు మనకు అనుకూలంగా ఓట్లు వేశారని, తప్పకుండా గెలుస్తామని చెప్పుకొచ్చారు.

ఇక్కడా రెండు నాల్కల ధోరణే... 
ఓ వైపు టీడీపీయే గెలుస్తుందని భరోసానిస్తూ మరోవైపు ఎన్నికల్లో ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారో నివేదిక ఇవ్వాలని కోరారు. కొందరు సీనియర్లుగా చెప్పుకుని హల్‌చల్‌ చేశారే తప్ప ఎన్నికల్లో పనిచేయలేదని, వారి సంగతి తేల్చుతానని ఈ సందర్భంగా హెచ్చరించారు. అంతేకాకుండా ప్రతీ ఎన్నికల్లోనూ మనమే గెలవాలని, పార్టీ కార్యకర్తల్లో జవాబుదారీతనం పెంపొందించాలని, కేడర్‌ మేనేజ్‌మెంట్, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌లో పట్టు సాధించాలని, ఫలితాలపై అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, నాయకుల పనితీరుపై గ్రేడింగ్‌ చేయాలని సూచించారు. ఇదంతా చూస్తుంటే గెలుపుపై నమ్మకం లేదనే అభిప్రాయంతో మాట్లాడినట్టుగా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గెలుస్తామంటూనే ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నారని సమీక్షకు హాజరైన నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ సమీక్షలో రాజమహేంద్రవరం, టీడీపీ అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య  చౌదరి, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ ‘తమకు ఇంత మెజార్టీ వస్తుందని’ చెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీ అభ్యర్థి రూప మాత్రం జనసేన ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉందని, దాన్ని కొట్టిపారేయలేమని, ఆ పార్టీకి పడ్డ ఓట్లు ఎవరి కొంప ముంచుతాయో తెలియ’దంటూ తనకున్న భయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement