
సాక్షి, విజయవాడ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తిరుగుబాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. బ్రిటీష్ వారిపై, నిజాంపై పోరాటం చేశామని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపైనా పోరాడాలని ఉద్బోధించారు. ఐకమత్యంగా ఉంటూ న్యాయమైన హక్కులను సాధించుకునే వరకూ పోరాటం కొనసాగించాలని కోరారు. గతంలో ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేసినప్పుడు, తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకూ పోరాడామని అన్నారు. ఇప్పుడు మనం అడిగేది న్యాయమైన కోరికలని, ధర్మ పోరాటం చేస్తున్నా మని పేర్కొన్నారు. హక్కులని సాధించేదాకా వెనుకడుగు వేయబో మన్నారు. ఈ ధర్మ పోరాటంలో మనమే విజయం సాధిస్తామని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరి సహకారం కావాలన్నారు.
జైలుకు పోతామని భయపెడుతున్నారు
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులపై ఉందని చంద్రబాబు తెలిపారు. తాను కేవలం ముఖ్యమంత్రిని మాత్రమేనని, తన బలం ప్రజలేనని అన్నారు. ప్రజలు సహకరిస్తే కొండనైనా ఢీ కొంటానని వ్యాఖ్యా నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయడం లేదన్నారు. మన పొట్టకొట్టే అధికారం వారికి(కేంద్రం) ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంతో విభేదిస్తే జైలుకు పోతామని కొందరు భయపెడుతున్నారని, తాను నిప్పులాగా ఉన్నానని, ఎవరికీ భయపడనని చంద్రబాబు తెలిపారు.
ఆటోమొబైల్ హబ్‌గా ఏపీ: సీఎం
రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దు తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆశోక్ లేలాండ్ బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బస్సులను తయారు చేస్తే వాటిని మార్కెటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పరిశ్రమలు రావడం వల్ల మల్లవల్లి గ్రామం మెగా టౌన్‌షిప్‌గా మారు తుందని చెప్పారు. అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ వినోద్ కె.దాసరి మాట్లాడుతూ... తమ సంస్థ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.