హోదాను వదిలి.. ప్యాకేజి బాట..

Chandrababu Asks Centre To Release Package Funds - Sakshi

సాక్షి, హైదరాబాద్ : పైపైకి ప్రత్యేక హోదా కావాలంటున్నా, మనసులో మాత్రం చంద్రబాబు ధ్యాసంతా ప్యాకేజీపైనే ఉందని మరోసారి తేటతెల్లమైంది. ఏపీ సీఎం బుధవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో హోదా గురించి ఒక్కమాటా అడగకుండా, ప్యాకేజీలోని నిధుల కోసం కకృత్తిపడిన వైనం చూస్తే.. హోదా కోసం తాను చేస్తోన్న ధర్మపోరాటాలు వట్టి బూటకాలని ఆయనే ఒప్పుకున్నట్లైంది.

లేఖలో ఏం రాశారు?: ఈపీఏ కింద ఆరు ప్రాజెక్టులకు 12,072 కోట్ల రూపాయలు నిధులను ప్రత్యేక ప్యాకేజి కింద విడుదల చేయాలని చంద్రబాబు గత నెల 30వ తేదీన కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖలో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు కనీస ప్రస్తావన కూడా చేయలేదు.

ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రభుత్వం ‘వంచనపై ధర్మపోరాట దీక్ష’లను చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల నీతి ఆయోగ్‌ సమావేశాలకు హాజరైన చంద్రబాబు, అక్కడ నరేంద్ర మోదీని ప్రత్యేక హోదాపై నిలదీస్తారని మీడియా కోడై కూసింది. అయితే, అందుకు భిన్నంగా ఎప్పటిలానే మోదీకి చంద్రబాబు వంగి మరి దండం పెట్టి వచ్చారు తప్ప హోదా గురించి పల్లెత్తి మాటైనా మాట్లాడలేదు.

వంచనపై ధర్మపోరాట దీక్షల్లో పాల్గొన్న చంద్రబాబు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, తాను రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నానని పలుమార్లు పేర్కొన్నారు. అయితే, తాజాగా కేంద్రానికి నిధుల కోసం రాసిన లేఖలో అంశాలను నిశితంగా పరిశీలిస్తే ప్రత్యేక హోదాకు విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నట్లు అర్థం అవుతోంది. నిధులు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రధానంగా ఆరు ప్రాజెక్టుల గురించి చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. వాటిని త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

1. 2,220 కోట్ల రూపాయల డిజాస్టర్‌ ఫండ్‌
2. గ్రామీణ అభివృద్ధి 642 కోట్ల రూపాయలు
3. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ 1289 కోట్ల రూపాయలు
4. విశాఖ-చెన్నై కారిడార్‌కు 3188 కోట్ల రూపాయలు
5. కరువు నివారణ ప్రాజెక్టుకు 1149 కోట్ల రూపాయలు
6. 24 గంటల విద్యుత్‌ సరఫరాకు 3584 కోట్ల రూపాయలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top