
సాక్షి, హైదరాబాద్/తాడూరు: రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చినందుకు చవక ధరల దుకాణాలను రద్దు చేస్తామనడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలు అవసరమైనప్పటికీ.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు.
అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి చర్చించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తే పేదలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ విభాగాన్ని పటిష్టపర్చాలని పేర్కొన్నారు.
కాగా, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరు ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇందుకు అన్ని పార్టీలతో కలసి మహా పోరాటం చేస్తామన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో తలపెట్టిన పోరుబాట కార్యక్రమం ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.