ముగిసిన ‘ఢిల్లీ’ ప్రచారం

Campaigning for Delhi assembly election ends - Sakshi

న్యూఢిల్లీ: వాడివేడిగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు 11వ తేదీన వెలువడుతాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా మారిన షహీన్‌బాఘ్‌ అంశాన్ని బీజేపీ, తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రచారాంశాలుగా చేపట్టాయి. ప్రధాని  మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా∙సహా పార్టీలోని మహామహులను బీజేపీ ప్రచారరంగంలోకి దింపింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారం అంతా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంగానే సాగింది. బీజేపీ, ఆప్‌ల స్థాయిలో కాంగ్రెస్‌ ప్రచారం సాగలేదు.

మనోజ్‌ తివారీ డ్యాన్స్‌ నాకిష్టం
బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీని తాను ఎగతాళి చేశానన్న వార్తలను ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. తనకు నిజంగానే తివారీ పాటలన్నా, డాన్స్‌లన్నా ఇష్టమన్నారు. తివారీ భోజ్‌పురి నటుడన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా తాను మనోజ్‌ తివారీ పాటలను, డ్యాన్స్‌లను చూడాలని ప్రజలను కోరుతానని కేజ్రీవాల్‌ గురువారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తివారీని ఎగతాళి చేసి పూర్వాంచల్‌ వాసులను తాను అవమానించానన్న విమర్శలను కేజ్రీవాల్‌ కొట్టిపారేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందిన పూర్వాంచల్‌ వాసులు ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 67 సీట్లను ఆప్‌ గెలుచుకుంది. మూడింటిలో బీజేపీ విజయం సాధించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top