'టీడీపీకి దమ్ముంటే జగన్ సవాల్ స్వీకరించాలి'

buggana rajendranath criticises chandrababu and yanamala - Sakshi

సాక్షి, హైదరాబాద్ : టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు ఆ సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బుగ్గన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్యారడైజ్ పేపర్ల లీకుల్లో హెరిటేజ్ పేరు వచ్చినా.. దాని గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారని అభిప్రాయపడ్డారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారని, అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని బుగ్గన విమర్శించారు.

'ఏపీలో జరిగినంత అవినీతి దేశంలో మరెక్కడా జరగలేదు. పోలవరం, ప్రత్యేక హోదా లాంటి కీలకాంశాలను పక్కనపెట్టి కేవలం కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. రాజధాని, పట్టిసీమ, పుష్కరాలు, సదావర్తి భూములు, ఇసుక సహా అన్నింటిలోనూ అవినితీ, దోపిడిలకు పాల్పడ్డారు. ఓటుకు కోట్లు కేసు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుగా ఉంది. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణకు చూసి భయపడుతున్న చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సహా పరిటాల కుటుంబ సభ్యులు తెలంగాణ సర్కార్‌తో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వాస్తవం కాదా? మీ అవినీతిపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐతో విచారణ జరిపించుకుంటే వాస్తవాలు వెలుగుచూస్తాయి. అవినీతిలో కూరుకుపోయిన ఏపీ సీఎం, మంత్రులు జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ముందుగా పార్టీ మారిన మంత్రులను డిస్మిస్ చేసి, ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలి. ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న యనమలకు న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌కు డాక్యుమెంట్‌కు తేడా తెలియదా అని' సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top