మాయావతి ముందుచూపు

BSP To Support Samajwadi Party Candidates In Bypolls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను బలపర్చాలని బహుజన సమాజ్‌ పార్టీ నాయకురాలు మాయావతి నిర్ణయం తీసుకోవడం చాలా చిన్న విషయంగానే కనిపిస్తుందిగానీ అది చాలా పెద్ద విషయం. ఇది భవిష్యత్‌ కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అంశం. పైగా ఇది మాయావతి సహజ వైఖరికి పూర్తి భిన్నంగా తీసుకున్న నిర్ణయం. ఆమె రాజకీయ గురువు కాన్షీరావు 1993లో సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీకి మధ్యన పొత్తు కుదిర్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆమె ఏనాడు ఎస్పీతో పొత్తుకు మొగ్గు చూపలేదు. నాడు ఆ పొత్తు వల్ల రామ మందిరం ఉద్యమంతో మంచి ఊపు మీదున్న బీజేపీని ఓడించగలిగారు. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇరు పార్టీల మధ్య అవగాహన కుదురడం విశేషం.

1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాన్షీరామ్‌ మరోసారి పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఆ సారీ కాంగ్రెస్‌ పార్టీతో. మాయావతి ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాన్షీరామ్‌ వినిపించుకోలేదు. ఆ పొత్తు వల్ల కాంగ్రెస్‌ పార్టీ లాభ పడిందిగానీ బీఎస్పీ కాదు. అప్పటి నుంచి కాన్షీరామ్‌ పార్టీ విధాన నిర్ణయాలను మాయావతికే వదిలేశారు. అప్పటి నుంచి ఆమె ఎన్నికల అనంతరం పొత్తుల ద్వారా ముఖ్యమంత్రి అవుతూ వచ్చారు.

2007లో మాయావతి ఎవరి మీద ఆధాపడకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంపూర్ణ మెజారిటీ సాధించారు. ఆ తర్వాత బలహీన పడుతూ వచ్చిన ఆమె పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎస్పీతో పొత్తుకు మొగ్గుచూపారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఆమె ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఆమె పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

రాజ్యసభ సభ్యురాలుగా కేంద్ర రాజకీయల్లో రాణించిన మయావతి ఏప్రిల్‌లో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసి రాజ్యసభకు వెళతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్లమెంట్‌లో బలం పెంచుకోవాలని చూస్తున్నారని ఆ వర్గాలు అంటున్నారు. రెండు లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమాజ్‌ వాది అభ్యర్థులకు మద్దతిస్తున్నందుకు బదులుగా రాజ్యసభ ఎన్నికల్లో మాయావతి లేదా ఆమె సూచించిన పార్టీ అభ్యర్థికి సమాజ్‌వాది పార్టీ మద్దతు ఇవ్వాలని అవగాహన కుదుర్చుకున్న విషయం తెల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top