‘గవర్నర్‌-చంద్రబాబు భేటీ.. దేనికి?’

Botsa Satyanarayana Slams Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ కోసం ఈ నాలుగేళ్లలో ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా? అని వైఎస్సార్‌ సీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ, సీఎం చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఉన్నపళంగా గవర్నర్‌తో భేటీ కావాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందని బొత్స ప్రశ్నించారు. 

‘రాష్ట్రం కోసం ఏనాడూ ఆలోచించని చంద్రబాబు.. ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపారు. కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్‌ సూచించినట్లు టీడీపీనే చెబుతోంది. మరోవైపు తనపై కేంద్రం కేసులు పెట్టాలని చూస్తోందంటూ చంద్రబాబు చెబుతున్నారు. కేసులు పెడితే తిరగబడాలని పైగా ప్రజలను ఆయన పిలుపునిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గనుక బాబుపై చర్యలు తీసుకోకుంటే ఆ రెండు పార్టీలు లాలూచీ పడ్డట్లే. చీకటి ఒప్పందాన్ని ప్రజలకు చెప్పాలి. ఏపీలో టీడీపీకి నూకలు చెల్లిపోయాయి’ అని బొత్స తెలిపారు. 

ఏప్రిల్‌ 30న వంచన దినం.. బీజేపీ-టీడీపీ కలిసే ఏపీ ప్రజలను మోసం చేశాయన్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాట తప్పారన్నారు. అందుకే ఈ నెల 30వ తేదీన వంచన దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బొత్స తెలిపారు.  వైఎస్సార్‌ సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే ఈ పాటికి కేంద్రం దిగొచ్చేదన్నారు. ఒక్కసారి ఓట్లేసిన పాపానికే బలహీన వర్గాలకు అణగదొక్కుతారా? అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.  జస్టిస్‌ ఈశ్వరయ్య లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన బొత్స.. ఎల్లో మీడియా ఈ వార్తను ఎందుకు హైలెట్‌ చేయలేదని నిలదీశారు. చంద్రబాబుకు నష్టం వచ్చే వార్తలను బహుశా ఎల్లో మీడియా ప్రసారం చేయదేమోనని ఆయన ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top