పవన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..

BJP MLC Somu Veerraju Fire On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ ఇచ్చిన స్ర్కిప్ట్‌ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బీజేపీపై రుద్దడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు వెళతారని హెచ్చరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏ విధంగా ప్రత్యేక హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. యుజిడికి ఐదు వందల కోట్లను కేటాయించినా మూడు సంవత్సరాలలో పూర్తి చేయలేదని, ఫలితంగా అనేక మంది మృతి చెందారని వీర్రాజు విమర్శించారు. రూ.52వేల కోట్ల రూపాయలతో నిర్మించే పోలవరాన్ని 2018 నాటికి చంద్రబాబు ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి
రాజధాని నిర్మాణ కోసం అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు నిర్మాణాలపై ఎలాంటి చర్చ జరపలేదని, రాజధాని నిర్మాణ డిజైన్‌ ఇప్పటి వరకూ కూడా పూర్తిచేయలేదని అన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఇచ్చిన యుసిలో ఏమున్నాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు సూచించారు.

రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
విభజ బిల్లులోని అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అములు చేస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉందని వీర్రాజు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తట్టుకునే శక్తి బీజేపీకి ఉందన్నారు. త్వరలోనే నామినేటేడ్‌ పదవులకు రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top